Indigo Flight : ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ఆదివారం రాత్రి ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రయాణమధ్యలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌కు అభ్యర్థన చేశాడు. సకాలంలో తీసుకున్న నిర్ణయం వల్ల 191 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోగలిగారు.
ఈ ఘటన రాత్రి 9:27 గంటల సమయంలో జరిగింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఎయిర్‌బస్ A320 నియో విమానం, భువనేశ్వర్‌కు ఉత్తరంగా సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో ఇంజన్ నంబర్ 1లో సమస్య తలెత్తింది. ఇది గుర్తించిన వెంటనే పైలట్ అంతర్జాతీయ విమాన నియమాల ప్రకారం “పాన్ పాన్ పాన్” (PAN-PAN-PAN) అనే డిస్ట్రెస్ సిగ్నల్‌ను ప్రకటించారు. ఇది ప్రాణాంతకం కాని అత్యవసర పరిస్థితిని సూచించే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ అలర్ట్ కోడ్.
ఈ సంకేతం ప్రసారమయ్యాక రాత్రి 9:32 గంటల సమయంలో విమానాన్ని ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దిశానిర్దేశం చేసింది. తక్షణమే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ ఏర్పాట్లు చేయబడ్డాయి. కొన్ని నిమిషాల తర్వాత రాత్రి 9:53 గంటలకు విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సమస్య వచ్చినప్పటికీ సాంకేతిక సిబ్బంది, పైలట్ చాకచక్యంతో ప్రమాదం లేకుండా విమానాన్ని ల్యాండ్ చేయగలగడం ఊపిరి పీల్చుకునే విధంగా మారింది. ఈ సంఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ అధికార ప్రతినిధులు, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొన్నారు. ఇంజిన్‌లో ఎదురైన సాంకేతిక లోపంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.
ఇలాంటి సందర్భాల్లో పైలట్ వినియోగించే “పాన్ పాన్” కోడ్, సాధారణంగా వైద్య సమస్యలు, సాంకేతిక లోపాలు, లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కావాల్సినపుడు ఉపయోగిస్తారు. ఇది “మే డే” కంటే తక్కువ అత్యవసర స్థాయిని సూచించడంలో ఉపయోగపడుతుంది.
ఇండిగో విమానానికి జరిగిన ఈ అత్యవసర ల్యాండింగ్ ఘటన మరోసారి విమాన సిబ్బంది ప్రతిస్పందనా సామర్థ్యాన్ని చాటిచెప్పింది. కాగా, ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు , వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.