Nuclear Energy: భారత రైల్వేలు మరో విప్లవాత్మక అడుగు వేయబోతున్నాయి. బొగ్గు రైలు ఇంజిన్లు పోయి.. ఇప్పుడు దాదాపు అన్నీ ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లే వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ రైళ్లు నడిచేందుకు రోజూ భారీగా విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి జల విద్యుత్, థర్మల్ విద్యుత్‌లను రైల్వే శాఖ వినియోగిస్తోంది. అయితే ఇవి రెండూ చాలా ఖరీదైనవి. అంతేకాక జల విద్యుత్ ఉత్పత్తికి జల వనరులను వినియోగించాలి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గును వాడాలి. ఈ రెండు పద్ధతుల్లోనూ సహజ వనరుల వినియోగంతోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మరో భిన్నమైన విద్యుత్ వనరును అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో రైల్వే శాఖ నిమగ్నమై ఉంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Telanganas OffTrack : అధికారం కోసం కుస్తీ.. నిశ్శబ్ద తిరుగుబాట్లు, తిరుగుబాటు డ్రామాలు, మంత్రివర్గంలో రచ్చ
రైల్వే మంత్రి కీలక ప్రకటన
అణు విద్యుత్‌ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది. ఇందుకోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలను రైల్వే శాఖ సంప్రదించింది. ఈవివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. శిలాజఇంధనం వినియోగాన్ని తగ్గించి అణువిద్యుత్‌ను వినియోగించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వేలకు ఏటా విద్యుత్ అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా, భవిష్యత్తులో ఏర్పాటయ్యే అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను కొనాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తామన్నారు. అణువిద్యుత్ స్వచ్ఛమైన ఇంధన వనరు అని ఆయన తెలిపారు. దీనివల్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గి, వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల తగ్గిపోతుందన్నారు.
Also Read :Reliance Spinner: రూ.10కే రిలయన్స్ ‘స్పిన్నర్’.. చౌకగా స్పోర్ట్స్ డ్రింక్
అణు విద్యుత్ కేంద్రాలకు తెలంగాణ నుంచే..
మనదేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల మంజూరు, స్థాపన, ఉత్పత్తి, వినియోగం అంతా కేంద్ర ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐ) పరిధిలో ఉంటుంది. దీనికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అణు రియాక్టర్లు ఉన్నాయి. దేశంలోని అన్ని అణు విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచే ముడి సరుకు, మణుగూరు నుంచి భారజలం సప్లై అవుతుంది. మన దేశం పూర్తిగా స్వచ్ఛ ఇంధనాల వైపు మరలాలంటే అణు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగాలి. ఈ దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తుండటం మంచి పరిణామం. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో అణు విద్యుత్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రకటనలు చేసింది. రూ.20వేల కోట్లతో ‘అణు ఇంధన మిషన్’ ఏర్పాటు ద్వారా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లపై పరిశోధన- అభివృద్ధికి పెద్దపీట వేస్తామని వెల్లడించింది. 2033 నాటికి కనీసం అయిదు చిన్న రియాక్టర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇంధన భద్రత, కాలుష్యం కట్టడికి ఇవి ఉపయోగపడతాయి.