NSAB : ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్‌పై దాడికి రెడీ అవుతున్న వేళ భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ)ను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా అలోక్ జోషిని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈయన గతంలో భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ హోదాలో కీలకమైన సేవలు అందించారు. ఎన్‌ఎస్‌ఏబీలో(NSAB) ఏడుగురు సభ్యులు ఉంటారని కేంద్రం తెలిపింది. సభ్యులుగా పశ్చిమ భారత వాయుసేన విభాగం మాజీ కమాండర్ పి.ఎం.సిన్హా, దక్షిణ భారత ఆర్మీ మాజీ కమాండర్ ఏకే సింగ్, రేర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బి.వెంకటేశ్ వర్మలను నియమించింది.
Also Read :IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్‌ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అలోక్ జోషికి ఈ పదవి ఎందుకిచ్చారో తెలుసా ?
- అలోక్ జోషి సీనియర్ ఐపీఎస్ అధికారి.
- ఆయన 1952లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు.
- అలోక్ జోషి 1976లో హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
- ప్రస్తుతం అలోక్ జోషి వయసు 73 సంవత్సరాలు.
- భారత్ – చైనా యుద్ధం 1962లో జరిగింది. ఆ యుద్ధంలో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాతే 1968లో ప్రత్యేక గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా)ను భారత్ ఏర్పాటు చేసింది.
- అలోక్ జోషి తన కెరీర్‌లో తొలుత హర్యానా పోలీసుశాఖలో పనిచేశారు.
- తదుపరిగా ఆయనకు భారత ఇంటెలీజెన్స్ బ్యూరోలో పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
- భారత ఇంటెలీజెన్స్ బ్యూరోలో ఉండగా నేపాల్, పాకిస్తాన్‌లలో అలోక్ జోషి పలు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించారు.
- 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో అలోక్ జోషికి కీలక అవకాశం లభించింది. ఆయనను భారత ఇంటెలీజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు.
- 2008లో ముంబై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో భారత గూఢచార సంస్థ ‘రా’, భారత ఇంటెలీజెన్స్ బ్యూరోలను సమన్వయం చేయడంలో అలోక్ జోషి కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ రెండు విభాగాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇప్పుడు అలోక్ జోషికి జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ) ఛైర్మన్ పదవిని ప్రధాని మోడీ అప్పగించడానికి ప్రధాన కారణమిదే. పాక్‌పై భారత్ దాడి చేయనున్న వేళ భారత గూఢచార, నిఘా విభాగాల సమన్వయం కోసం అలోక్ నుంచి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది.
- ప్రస్తుత భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో సమన్వయం చేసుకుంటూ అలోక్ జోషి అండ్ టీమ్ పనిచేయనున్నారు.
- ఇక గతంలోకి వెళితే.. 2010లో భారత గూఢచార సంస్థ ‘రా’ స్పెషల్ సెక్రెటరీగా అలోక్ జోషికి పదోన్నతి లభించింది.
- 2012 సంవత్సరంలో భారత గూఢచార సంస్థ ‘రా’ అధిపతిగా అలోక్ జోషి నియమితులు అయ్యారు. 2014 వరకు ఆయన రా సారథిగా మన దేశానికి కీలక సేవలు అందించారు.