Anmol Bishnoi Custody : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ముఠా చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈక్రమంలోనే భారత నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వారం క్రితం కాలిఫోర్నియాలో లారెన్స్ బిష్ణోయి తమ్ముడు అన్మోల్ బిష్ణోయిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. నిధుల సేకరణ కోసం అమెరికాకు వెళ్లగా.. అతడిని పట్టుకున్నట్లు తెలిసింది. ధర్మన్ జోత్ కహ్లోన్ అనే వ్యక్తితో కలిసి అన్మోల్ అమెరికాలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని భారత నిఘా వర్గాలు అంటున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు అతడిని విచారణ నిమిత్తం అయోవా రాష్ట్రంలోని పొటావాటమీ కౌంటీ జైలుకు తరలించారు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం కస్టడీలో అన్మోల్‌ను ఎఫ్‌బీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదుల హత్యల వెనుక కూడా లారెన్స్ బిష్ణోయి ముఠా హస్తం ఉందని అమెరికా అనుమానిస్తోంది. ఆ అంశాలపైనా అన్మోల్‌ను(Anmol Bishnoi Custody) ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు కెనడాలో షూటర్లతో ఖలిస్తానీలను మర్డర్ చేయించారనే దానిపై అతడి నుంచి సమాచారాన్ని రాబట్టనున్నారు.
Also Read :Toilet Battle : అమెరికా కాంగ్రెస్‌లో టాయిలెట్ వార్.. ట్రాన్స్‌జెండర్ నాయకురాలికి వ్యతిరేకంగా తీర్మానం
అన్మోల్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అన్మోల్‌ను అప్పగించాలని భారత్ కోరుతోంది. అయితే దీనిపై వెంటనే అమెరికా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. కోర్టు విచారణ తర్వాతే అయోవా జైలుకు అన్మోల్‌ను తరలించినందున.. న్యాయపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే అప్పగింత అంశంపై పురోగతి చోటుచేసుకోనుంది.
Also Read :Rice Millers : సర్కారుకు రూ.605 కోట్లు బకాయిపడ్డ 10 మంది మిల్లర్లు
అన్మోల్ బిష్ణోయిపై పంజాబ్, ముంబై, ఢిల్లీలలో దాదాపు 20 కేసులు ఉన్నాయి. ఇటీవలే ముంబైలో జరిగిన బాబా సిద్ధిఖీ హత్యకు ముందు.. షూటర్లతో అన్మోల్ ఛాట్ చేశాడని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని భారత ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో అన్మోల్ పోస్టు పెట్టాడు.ఇక అన్మోల్‌తో పాటు కెనడాలోనే ఉంటున్న గోల్డీబ్రార్ ఎక్కడున్నాడు ? అతడిని ఎప్పుడు పట్టుకుంటారు ? అనే దానిపై డిస్కషన్ మొదలైంది.