ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!

వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Indian Army

Indian Army

Indian Army: జమ్మూ కాశ్మీర్‌లోని డోడా మరియు కిష్త్వార్ ప్రాంతాల్లో 30-35 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు అందిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ‘చిల్లై కలాన్’ (మంచు తీవ్రత ఎక్కువగా ఉండే కాలం) నడుస్తున్నప్పటికీ గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా సైన్యం సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది.

వింటర్ ఆపరేషన్

సాధారణంగా శీతాకాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఈసారి భారత సైన్యం తన వ్యూహాన్ని మార్చింది. గూఢచారి సంస్థల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు డోడా, కిష్త్వార్‌లోని ఎత్తైన మంచు కొండల్లో తలదాచుకుంటున్నారు. వీరిని ఏరివేసేందుకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు- సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి.

రాష్ట్రీయ రైఫిల్స్ మోహరింపు

కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌లో ఆరితేరిన భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లను అత్యంత ప్రమాదకరమైన ఈ ఎత్తైన ప్రాంతాలలో మోహరించారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టడానికి ఈ దళాలకు అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలను అందించారు. డిసెంబర్ 21 నుండి జనవరి 31 వరకు ఉండే ‘చిల్లై కలాన్’ కాలంలో ఎముకలు కొరికే చలి, భారీ హిమపాతం ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వింటర్ ఆపరేషన్స్ నిర్వహించడానికి సైన్యం సర్వసన్నద్ధమైంది.

Also Read: ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!

నిఘా కేంద్రాల ఏర్పాటు

గతంలో పహల్గామ్ మారణకాండకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు డోడా, కిష్త్వార్ మార్గం ద్వారానే అనంతనాగ్ చేరుకున్నారు. అందుకే ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మంచు ప్రాంతాలలో తాత్కాలిక నిఘా పోస్టులు, బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కదలికలను, వారు దాక్కున్న స్థావరాలను గుర్తించడానికి నిరంతర నిఘా కొనసాగుతోంది.

స్థానికులపై ఒత్తిడిని అడ్డుకోవడం

ఉగ్రవాదులు ఆహారం, ఆశ్రయం కోసం స్థానిక గ్రామస్తులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అందింది. భారత సైన్యం ఆ ప్రాంతాల్లో నిరంతరం పహారా కాయడం వల్ల ఉగ్రవాదులను జనావాసాలకు దూరం చేసి ఒంటరిని చేయొచ్చు. స్థానికులకు రక్షణ కల్పించ‌వ‌చ్చు. వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.

  Last Updated: 27 Dec 2025, 08:58 PM IST