Nuclear Weapons Cargo : నిఘా వర్గాల సమాచారంతో పాకిస్తాన్‌కు భారత్ షాకిచ్చింది. చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి వెళ్తున్న అణ్వాయుధ కార్యక్రమ సంబంధిత సామగ్రి, యంత్రాలతో కూడిన నౌకను అడ్డుకుంది. మాల్టా జెండాతో వెళ్తున్న ‘సీఎంఏ సీజీఎం అట్టీలా’ నౌకను ముంబైకి సమీపంలోని ఎన్‌హావా శేవా పోర్టు వద్ద అడ్డుకున్న భారత భద్రతా సిబ్బంది.. అందులోని 22,180 కిలోల బరువున్న సాంకేతిక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నౌకలో అణ్వాయుధ కార్యక్రమ సంబంధిత యంత్రాలతో పాటు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వాడే సామగ్రి ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
నౌకలో ఇటలీ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్‌సీ) మెషీన్ ఉందని తెలిపారు. దీన్ని పరిశీలించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారులు అణ్వాయుధ కార్యక్రమానికి వినియోగించేదిగా తేల్చారు. క్షిపణుల అభివృద్ధిలోనూ ఈ మెషీన్‌ను ఉపయోగిస్తారని చెప్పారు. ఉత్తర కొరియా(Nuclear Weapons Cargo) కూడా అణ్వాయుధ కార్యక్రమాల్లో ఈ మెషీన్లను వినియోగిస్తోందన్నారు. షిప్పింగ్ వివరాల్లో అన్నీ తప్పులే ఉన్నాయని, పాకిస్థాన్ అక్రమ ఆయుధాల సేకరణకు ఇది రుజువని అధికారులు అభిప్రాయపడ్డారు. వాస్సెనార్ ఒప్పందం ప్రకారం.. సీఎన్‌సీ మెషీన్ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తున్నందున స్వాధీనం చేసుకున్నామని భారత అధికారులు వెల్లడించారు. పౌర, సైనిక సేవలకు ఉపయోగించే ఈ డ్యూయెల్ మెషీన్లను ఒప్పందంలోని దేశాలు స్వాధీనం చేసుకోవచ్చని వివరించారు.
Also Read : Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్‌తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?
‘సీఎంఏ సీజీఎం అట్టీలా’ నౌకకు సంబంధించి లభించిన పత్రాల్లో లోడింగ్ బిల్లులు, సరుకుకు సంబంధించిన ఇతర వివరాలు ఉన్నాయి. సరుకు సప్లై చేస్తున్న సంస్థ పేరు ‘షాంఘై JXE గ్లోబల్ లాజిస్టిక్స్ కో లిమిటెడ్’ అని ఉంది. పాకిస్తాన్‌లోని సియాల్ కోట్ కు చెందిన పాకిస్తాన్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దీన్ని పంపుతున్నట్లు వెల్లడైంది. మరింత దర్యాప్తు చేయగా.. తైవాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ కో నుంచి పాకిస్తాన్ లోని కాస్మోస్ ఇంజనీరింగ్‌కు ఈ సరుకు వెళ్తోందని తేలింది. క్షిపణి ఉత్పత్తిలో వినియోగించే ఇండస్ట్రియల్ ఆటోక్లేవ్ ను ఓడలో పారిశ్రామిక సామాగ్రిగా దాచిపెట్టి ఇస్లామాబాద్ కు చైనా సప్లై చేసిన వ్యవహారం 2020 సంవత్సరంలోనూ వెలుగుచూసింది. పాకిస్తాన్ అణు కార్యక్రమానికి చైనా సాయం చేస్తోందనే ఆందోళనలు తాజా ఘటనతో మరింత ఎక్కువయ్యాయి.