India-US Trade : 2025లో భారత్-అమెరికా ముడి చమురు వాణిజ్యం గణనీయంగా పెరిగి, ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో కొత్త దశను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రెండు దేశాల మధ్య ఇంధన వ్యాపార ఒప్పందాలు వేగంగా విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ పెరుగుదల కేవలం వాణిజ్య అంశం మాత్రమే కాకుండా, భారత శక్తి సరఫరా వ్యూహంలో మార్పుకు సంకేతమని సూచిస్తున్నాయి.
2024లో అమెరికా నుంచి భారత్ రోజుకు సగటున 0.18 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు దిగుమతి చేసుకోగా, 2025లో అది 0.271 మిలియన్ బ్యారెల్స్‌కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 51 శాతం పెరిగినట్లు ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దిగుమతుల పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. ఈ మూడు నెలల్లో అమెరికా నుంచి చమురు దిగుమతులు 114 శాతం పెరిగి, డాలర్ల విలువలో 1.73 బిలియన్ నుంచి 3.7 బిలియన్ వరకు ఎగసిపోయాయి.
Methi Water Benefits: ప్రతిరోజూ మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
జూన్‌తో పోలిస్తే జూలైలో దిగుమతులు మరింత పెరిగి మరో 23 శాతం వృద్ధి సాధించాయి. జూన్‌లో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో అమెరికా వాటా 3 శాతం మాత్రమే ఉండగా, జూలై నాటికి అది 8 శాతానికి పెరిగింది. ఇది భవిష్యత్తులో అమెరికా భారత చమురు సరఫరాలో ప్రధాన భాగస్వామిగా మారే సూచనలుగా అధికారులు భావిస్తున్నారు.
భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత చమురు సంస్థలు అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లను 150 శాతం మేర పెంచేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ముడి చమురు మాత్రమే కాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ (LPG), ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల రెండు దేశాల మధ్య ఇంధన రంగ సహకారం మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అధికారుల అభిప్రాయం ప్రకారం, ఈ వాణిజ్య విస్తరణతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఆర్థికపరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా మరింత బలపడే అవకాశం ఉంది. అమెరికా నుంచి పెరుగుతున్న సరఫరా భారత శక్తి భద్రతను మెరుగుపరచడమే కాకుండా, చమురు దిగుమతుల ఆధారంగా ఉన్న ఇతర దేశాలపై ఆధారాన్ని తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.