Site icon HashtagU Telugu

India-UK : భారత్-యూకే మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Modi

Modi

India-UK : భారత్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. గురువారం లండన్‌లో జరిగిన ఈ కీలక ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్‌ గోయల్‌, జొనాథన్‌ రేనాల్డ్స్‌లు సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్‌ యూనియన్‌ (EU) నుంచి యూకే బయటకు వచ్చిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు వెల్లడించారు. మోడీ-స్టార్మర్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందం ఫైనల్‌ అయింది.

సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ఈ ఒప్పందం భారత్‌, యూకే మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు కొత్త దశ ప్రారంభమవుతుందనే బ్లూ ప్రింట్‌. అనేక సంవత్సరాల కృషి తర్వాత ఇరు దేశాలు సమగ్ర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం చారిత్రాత్మకంగా నిలుస్తుంది” అని అన్నారు.

ఈ ఒప్పందంతో భారతీయ వస్త్రాలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్‌ వస్తువులు యూకే మార్కెట్‌లో మెరుగైన యాక్సెస్‌ పొందనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమలకు కొత్త అవకాశాలు వస్తాయని మోడీ తెలిపారు. అదే విధంగా యూకే తయారీ ఉత్పత్తులు – ముఖ్యంగా ఇండస్ట్రియల్‌ గూడ్స్‌, వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌ విడిభాగాలు – భారత్‌లో సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి.

యూకే కోసం ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని స్టార్మర్‌ అన్నారు. “EU నుంచి విడిపోయిన తర్వాత యూకే కుదుర్చుకున్న అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం ఇది. భారతదేశం ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో ఇదొక ముఖ్యమైనది” అని స్టార్మర్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను విస్తృతం చేస్తుందని అన్నారు.

ఒప్పందం ప్రకారం 99 శాతం భారతీయ ఉత్పత్తులు యూకే మార్కెట్‌లో సుంకాలు లేకుండా లభిస్తాయి. అదే సమయంలో యూకే ఉత్పత్తులకు భారతదేశంలో మరింత విస్తృతమైన యాక్సెస్‌ లభిస్తుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య విలువను రెట్టింపు చేసి 120 బిలియన్‌ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అదనంగా యూకేలో ఉద్యోగుల నియామకానికి భారత కంపెనీలకు మరింత సౌలభ్యం లభించనుంది.

ప్రస్తుతం యూకే, భారత్‌లో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారు. దాదాపు 36 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. 1000కిపైగా భారతీయ కంపెనీలు యూకేలో పనిచేస్తూ లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. 2024-25లో యూకేకి భారత ఎగుమతులు 12.6 శాతం పెరిగి 14.5 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.3 శాతం పెరిగి 8.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2023-24లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 21.34 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Blood Circulation : మెదడుకు రక్త ప్రసరణ సరిగా అవుతుందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే?