Bharat Antariksha Station : ‘భారత అంతరిక్ష స్టేషన్’ నిర్మాణ ప్రక్రియ 2035 సంవత్సరం కల్లా పూర్తి కానుంది. 2040 సంవత్సరం నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉంది. ఈవిషయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖలు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆయన విలేకరులకు ఇవాళ వివరించారు.
Also Read :Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!
- ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాలు అతి కొద్ది దేశాలకే ఉన్నాయని.. వాటి సరసన భారత్ కూడా చేరబోతోందని జితేంద్రసింగ్ తెలిపారు.
- భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్(Bharat Antariksha Station) 2024 చివరికల్లా లేదా 2026 ప్రారంభంలో జరిగే అవకాశం ఉందన్నారు.
- భారతదేశ తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ పేరు ‘సముద్రయాన్’. ఈ మిషన్‌లో భాగంగా ‘మత్స్య-6000’ అనే జలాంతర్గామిని రూపొందిస్తున్నట్లు జితేంద్రసింగ్ తెలిపారు.
- ‘మత్స్య-6000’ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని సముద్ర గర్భంలో గరిష్ఠంగా 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లొచ్చు. అక్కడి సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని స్టడీ చేయడమే ‘సముద్రయాన్’ ప్రధాన లక్ష్యమని జితేంద్రసింగ్ చెప్పారు.
- ‘మత్స్య-6000’ జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసింది.
- ఇప్పటివరకు భారతదేశం శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో 397 ఉపగ్రహాలను గత పదేళ్లలో ప్రయోగించామని కేంద్రమంత్రి వివరించారు.
- గగన్ యాన్ మిషన్, భారత అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సాయాన్ని మన ఇస్రో తీసుకుంటోంది. అక్కడి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇస్రో తనదైన శైలిలో మార్పులు, చేర్పులు చేస్తోంది. గగన్ యాన్ మిషన్‌కు వెళ్లనున్న భారత వ్యోమగాములకు ప్రస్తుతం అమెరికాలో ట్రైనింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలా ఉండాలి ? అక్కడి వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి ? ఎలాంటి ఫుడ్ తినాలి ? అనే దానిపై భారత వ్యోమగాములకు ట్రైనింగ్ ఇస్తున్నారు.