Sri Lankan Navy Firing : శ్రీలంక నౌకాదళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. మంగళవారం తెల్లవారుజామున డెఫ్ట్ (నెడున్ థీవు) ద్వీపం సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటగానే భారత మత్స్యకారులపైకి ఫైరింగ్ జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జాఫ్నాలోని ఒక బోధనాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు.
Also Read :Emergency Ticket System : ‘ఐఆర్‌సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్‌పై వివాదం.. ఏజెంట్ల దందా
జాఫ్నాలో భారత్ యాక్టివ్
ఈవిషయం తెలిసిన వెంటనే జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఆ ఆస్పత్రిని(Sri Lankan Navy Firing) సందర్శించారు. అందులోని చికిత్స పొందుతున్న భారతీయ మత్స్యకారులను పరామర్శించారు. అన్ని రకాల సాయం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. మరో ఎనిమిది భారత మత్స్యకారులు శ్రీలంక నౌకాదళం కస్టడీలో ఉన్నారు. మొత్తం 13 మంది భారత మత్స్యకారులు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. వీరిలో ఆరుగురు పుదుచ్చేరిలోని కరైకల్ వాస్తవ్యులు కాగా, ఏడుగురు తమిళనాడు వాస్తవ్యులు. ఈ ఘటన నేపథ్యంలో భారత మత్స్యకారులను విడుదల చేయించాలంటూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి లేఖ రాశారు.
Also Read :NMDC Vendor Meet: విజన్ 2030 కోసం ఎన్ఎండీసీ వెండర్ మీట్
మత్స్యకారులపైకి సైనిక శక్తిని ప్రయోగిస్తారా ?
భారత మత్స్యకారులపైకి శ్రీలంక నౌకాదళం కాల్పులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మత్స్యకారులపైకి సైనిక శక్తిని ప్రయోగించడం సరికాదని తెలిపింది. మత్స్యకారుల చేపల వేట అంశాన్ని మానవీయ కోణంలోనే చూడాలని శ్రీలంకకు సూచించింది. మత్స్యకారులు జీవనోపాధి కోసమే సముద్రంలోకి వస్తారని శ్రీలంక గుర్తుంచుకోవాలని భారత విదేశాంగ శాఖ చెప్పింది. ఇవాళ ఉదయం న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్‌ను భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి ఈమేరకు భారత్ నిరసనను వ్యక్తం చేసింది. కొలంబోలోని భారత హైకమిషన్ కూడా ఇదే అంశంపై శ్రీలంక విదేశాంగ శాఖ ఎదుట నిరసనను తెలిపింది. భారత మత్స్యకారులపై కాల్పులు సరికాదని పేర్కొంది.