DGMO : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) ల మధ్య చర్చలు శాంతియుత వాతావరణంలో ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సంభాషణలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఈ చర్చలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ, వాయిదా అనంతరం రెండు దేశాల ప్రతినిధులు మద్య చర్చలు సవ్యంగా కొనసాగినట్టు సమాచారం. ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే పరిణామాలు, అలాగే పరస్పర అవగాహన పెంచే అంశాలపై వారు చర్చించారు.
Read Also: Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు
గత కొన్ని వారాలుగా భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో పరిస్థితి ఘర్షణాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాక్ సైన్యం తరుచూ చేపట్టిన కవ్వింపు చర్యల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. రెండు దేశాల సైనికుల మధ్య అప్పుడప్పుడు జరిగే కాల్పులు శాంతి ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితుల్లో మే 10న భారత్-పాక్‌లు కాల్పుల విరమణను పునరుద్ఘాటించేందుకు అంగీకరించాయి. దీని ప్రకారం, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలని ఇరుదేశాలూ ముట్టడించాయి. ఈ తాజా డీజీఎంవో చర్చలు కూడా ఇదే దిశగా మున్ముందు పరస్పర విశ్వాసాన్ని పెంచే ప్రయత్నంగా భావించాలి.
చర్చల అనంతరం అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఇది ఒక సానుకూల సంకేతంగా భావించబడుతోంది. ఈ పరిణామాలతో భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య మరిన్ని సన్నిహిత సంభాషణలకు దారి తెరవవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో శాంతి, ప్రజల భద్రత కోసం ఈ చర్చలు కీలకంగా నిలవనున్నాయి. ఈ చర్చలతోపాటు, ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపై శాంతి దిశగా పరస్పర అంగీకారాలు, చర్చలు మరింత బలపడాలని ఆశిస్తున్నారు.
కాగా, సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వర్తించే ఈ ఉన్నతాధికారుల మధ్య తొలి దశ సంప్రదింపులు సాయంత్రం ముగిశాయి. అయితే, నేటి చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దుల్లో శాంతి స్థాపన దృష్ట్యా డీజీఎంఓ స్థాయి చర్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక, సాధారణంగా ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్‌లైన్ ద్వారా లేదా ఇతర ప్రత్యేక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుగుతుంటాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందాల అమలు, అనుకోని సంఘటనల నివారణ వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఇరు సైన్యాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది.