Site icon HashtagU Telugu

India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?

India US Court Summons Gurpatwant Singh Pannun

India Vs US : భారత్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. తనను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ గూఢచార విభాగాలు కుట్ర పన్నాయంటూ అమెరికాలో ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యూయార్క్ దక్షిణ జిల్లా కోర్టు  విచారించింది. ఈ కేసులో భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.  భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్,  రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి. వీరంతా 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమన్లకు సంబంధించిన కాపీని తీవ్రవాది గురుపత్వంత్ తన ఎక్స్‌ అకౌంటులో పోస్ట్ చేశాడు.

Also Read :Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు

తీవ్రవాది గురుపత్వంత్‌కు చాలా ఏళ్లుగా అమెరికా ఆశ్రయం కల్పిస్తోంది. మరెంతో మంది ఖలిస్తాన్ వేర్పాటువాదులకు అమెరికా మిత్రదేశం కెనడా ఆశ్రయం కల్పిస్తోంది. ఆయా దేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ తీవ్రవాదులు భారత్‌లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. అమెరికా అగ్రరాజ్యం కావడంతో ఈ అంశంపై భారత్ బలంగా నిలదీయలేకపోతోంది. దీంతో ఇప్పుడు భారత్‌నే టార్గెట్‌గా చేసే పరిస్థితి ఏర్పడిందని  పరిశీలకులు అంటున్నారు.  అమెరికాలో జరిగిన కుట్రతో సంబంధం లేదని భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ అలాంటి  ఏదైనా ఉంటే దర్యాప్తు చేయిస్తామని భారత సర్కారు అమెరికాకు హామీ ఇచ్చింది. అయినా ప్రపంచ పోలీసులా అమెరికా వ్యవహరిస్తూ.. భారత్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు ఇంతటి వివాదం నడుస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినవని ఇరుదేశాల విదేశాంగ శాఖలు చెబుతుండటం గమనార్హం. ఈనేపథ్యంలోనే భారత్ తన మిత్రదేశం రష్యాకు చేరువ అవుతోంది. ఉక్రెయిన్‌తో దానికి శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల్లో భారత్ బిజీగా ఉంది.