Site icon HashtagU Telugu

Pak airlines : పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేతకు కేంద్రం అడుగులు..!

india considering shutting airspace to pak airlines banning ships says sources

india considering shutting airspace to pak airlines banning ships says sources

Pak airlines : భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్‌ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే.. కౌలాలంపూర్‌ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు చేరుకునే పాక్‌ విమానాలు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, భారత ఓడరేవుల్లోకి పాకిస్థాన్‌ నౌకలు రాకుండా నిషేధం విధించే దిశగా కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

Read Also: Pahalgam Attack : హషిమ్‌ మూసాను పాక్ పారా కమాండోగా గుర్తించిన అధికారులు

ఇక పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని పాకిస్థాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే. తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్‌పై పాకిస్థాన్‌ విషం చిమ్మింది. తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ కూడా దీనిపై ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు సమాచారం. ఒకవేళ దీనిపై భారత్‌ నిర్ణయం తీసుకుంటే.. అది పాక్‌ ఎయిర్‌లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్‌ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది. ఇప్పుడు భారత్‌ నిషేధం విధిస్తే.. దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణసమయం పెరగడంతో పాటు నిర్వహణ పైనా అదనపు భారం పడుతుంది. ఇక, అయితే, ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాక్‌కే ఎక్కువ నష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు భారత్‌ నుంచి పాక్‌ గగనతలం మీదుగా వారానికి 800లకు పైగా అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేవి. ఇందుకోసం ఓవర్‌ఫ్లైట్‌ ఫీజు కింద పాక్‌ రోజుకు 1,20,000 డాలర్లు వసూలుచేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని దాయాది నష్టపోవాల్సిందే. ఇటీవల మన విమానాలకు పాక్‌ తమ గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఎయిర్‌లైన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి.

Read Also: Target PoK : పీఓకే‌పైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం