INDIA : జూన్ 1న ఇండియా కూటమి భేటీ.. ఎందుకో తెలుసా ?

జూన్ 1న(శనివారం) ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి.

  • Written By:
  • Publish Date - May 27, 2024 / 03:09 PM IST

INDIA : జూన్ 1న(శనివారం) ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిలోని మిత్రపక్షాలు కనబర్చిన పనితీరును సమీక్షించుకునేందుకు ఈ సమావేశాన్ని తలపెట్టారు. దీనికి  హాజరుకావాలంటూ అన్ని మిత్రపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సందేశాన్ని పంపినట్లు  సమాచారం. ఏడు విడతల పోలింగ్‌ ఘట్టంపై ఇండియా(INDIA) కూటమి పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఏమిటి ?  అనే దానిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join

చివరిదైన ఏడోదశ పోలింగ్ రోజున (జూన్ 1న) జరుగుతున్న ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యం  ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలకు సరిగ్గా మూడు రోజుల ముందు జరుగుతున్న ఈ భేటీపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండటం గమనార్హం.

Also Read :Fake Doctors : నకిలీ డాక్టర్ల హల్‌చల్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

జూన్ 1న ఇండియా కూటమి సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు హాజరవుతారని సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1 సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయిన మమతాబెనర్జీ ఈ కీలక సమావేశానికి హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Also Read :Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్‌ ఫీవర్‌ ఉందంటూ లేఖ