India Attack : మంగళవారం అర్ధరాత్రి భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో 90 మందికిపైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని బహావల్‌పూర్, మురిద్కే పట్టణాలలో ఉన్న రెండు ఉగ్రవాద స్థావరాలను భారత్ పేల్చేసింది. ఈ దాడి జరిగినప్పుడు ఒక్కో ఉగ్రవాద స్థావరంలో దాదాపు 30 మంది దాకా ఉగ్రవాదులు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు ఉగ్రవాద స్థావరాల నుంచి జమ్మూకశ్మీరులోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ పంపేది. ఇలాంటి మరెన్నో ఉగ్రవాద స్థావరాలు పాక్ ఆక్రమిత కశ్మీరు సరిహద్దు గ్రామాల్లో ఉన్నట్లు భారత్ గుర్తించింది. ఈ దాడుల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత రక్షణశాఖ ప్రకటించింది.
Also Read :Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్
పాక్ ఆర్మీ వాదన ఇదీ..
మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ(India Attack) వాదన మరోలా ఉంది. భారత్ దాడిలో కేవలం 11 మందే చనిపోయారని పాక్ సైన్యం బుకాయిస్తోంది. తమ దేశంలోకి ప్రవేశించిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ అంటోంది. తాము కూల్చేసిన భారత ఫైటర్ జెట్ల జాబితాలో 3 రాఫెల్, 1 సుఖోయ్, 1 మిగ్ ఉన్నాయని అంటోంది. భారత ఆర్మీ జనావాసాలపై దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. భారత్ దాడి చేసిన వెంటనే ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస్తాన్ సమాచారాన్ని అందించింది. తమకు కూడా ప్రతిదాడి చేసే హక్కు ఉందని తెలిపింది. ఈ లెక్కన భారత్‌పై ప్రతిదాడికి పాకిస్తాన్ రెడీ అవుతోంది. ప్రతిదాడి చేసే క్రమంలో పాకిస్తాన్ అతిగా ప్రవర్తిస్తే.. ఈ యుద్ధం తీవ్రరూపు దాల్చే ముప్పు ఉంది. ఈనేపథ్యంలో జమ్మూకశ్మీరులో భారత ఆర్మీ గగనతల పహారాను పెంచింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థలను మోహరించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే కాల్పుల తీవ్రతను పెంచింది. పాక్ ఆర్మీ కాల్పుల్లో జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామంలోని ముగ్గురు సామాన్య పౌరులు చనిపోయారు.
Also Read :Operation Sindoor: మోదీ ఉంటే సాధ్యమే.. ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్న భారత్ ప్రజలు!
భారత సైనిక దళాలకు మా మద్దతు : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. భారత ఆర్మీకి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందన్నారు. భారతదేశ సమగ్రతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఉగ్రవాద నిర్మూలన అనేది జరిగి తీరాలని ఖర్గే చెప్పారు. ‘‘ఇలాంటి సమయంలో యావత్ దేశం ఏకతాటిపై నిలవాలి. భారత ప్రభుత్వానికి, సైన్యానికి సంఘీభావం తెలపాలి. భారత సైనిక దళాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది’’ అని ఖర్గే చెప్పారు.
భారత ఆర్మీని చూసి గర్విస్తున్నాను : రాహుల్ గాంధీ
‘‘పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేయడం చాలా మంచివిషయం. భారత ఆర్మీని చూసి నేను గర్విస్తున్నాను. భారత త్రివిధ దళాల పనితీరు అమోఘం. వారికి మా మద్దతు సదా ఉంటుంది. జై హింద్’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేశారు.