Discount Offer: తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకలోని కనకేసంతురాయ్ మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగపట్నం, కనకేసంతురాయ్ మధ్య 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాగపట్నంలో ఫెర్రీ ఎక్కితే.. 3 గంటల సముద్ర ప్రయాణం తర్వాత శ్రీలంకలో ల్యాండ్ అయిపోవచ్చు. ఇందుకోసం టికెట్ ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.7670గా నిర్ణయించారు. అయితే ప్రమోషనల్ ఆఫర్‌గా ఇవాళ ఒక్కరోజు (అక్టోబర్ 14న) ఒక్కో టికెట్‌కు రూ.2800 మాత్రమే తీసుకుంటున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10నే ఈ ఫెర్రీ సేవలు ప్రారంభం కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఫెర్రీ సేవల ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 14కు వాయిదా వేశారు. 40 ఏళ్ల క్రితమే శ్రీలంక -భారత్ మధ్య ఫెర్రీ సర్వీసులు నడిచేవి. కానీ ఎల్టీటీఈతో యుద్దం కారణంగా వాటిని అకస్మాత్తుగా ఆపేశారు.భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారమే ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ సైతం ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
150 మందితో జర్నీ..
తమిళనాడు, శ్రీలంక మధ్య నడిచే ఫెర్రీ పేరు ‘చెరియపాని’. దీన్ని కేరళ లోని కొచ్చి పోర్ట్‌లోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఇందులో 150 మంది ప్రయాణికులు జర్నీ చేయొచ్చు. పూర్తి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థతో ఇది ఉంటుంది. ఈ షిప్లో ప్రతి ప్రయాణికుడు 50 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ఫెర్రీ సర్వీస్ 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా, బంగాళాఖాతంలో తుపాను సంకేతాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ సేవలను కొన్ని రోజులు నిలిపివేస్తారు. ఆ తర్వాత ఫెర్రీ సేవలను మళ్లీ ప్రారంభమవుతాయి.