Independence Day 2025: 79వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day 2025) వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ముస్తాబైంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ఎర్రకోటపై జరిగే ప్రధాన కార్యక్రమం కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రతాపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఇందులో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోలు కలిపి మొత్తం 10 వేల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు.
ట్రాఫిక్ నియంత్రణ
వేడుకల సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. వీరు ప్రధాన రహదారులలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి, పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కృషి చేయనున్నారు.
Also Read: Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
అధునాతన సాంకేతికతతో నిఘా
ఎర్రకోట భద్రత కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అనుమానితులను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు (AI)తో కూడిన 700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనితో పాటు డ్రోన్ దాడులను నివారించడానికి డ్రోన్ డిటెక్షన్ గ్రిడ్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలపై స్నిపర్లు, గాలిలో ఎగురుతున్న గాలిపటాలను అడ్డుకునేందుకు కైట్ క్యాచర్లు, నిఘా పర్యవేక్షణ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి.
ప్రధాన ప్రదేశాలలో భద్రత
కేవలం ఎర్రకోట వద్దే కాకుండా నగరంలోని కీలక ప్రదేశాలైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో కూడా భద్రతను గణనీయంగా పెంచారు.
ప్రధాని మోదీ ప్రసంగం
రేపు (ఆగస్టు 15న) ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ఆయన 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడం. ఈ ప్రసంగంలో దేశ ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, ఇతర కీలక అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.