Sharad Pawar : ఎన్నికల రాజకీయాల నుంచి త్వరలోనే రిటైర్ అవుతానని ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్, 84 ఏళ్ల రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను. నా పదవీ కాలం ఇంకా సగం మిగిలి ఉంది. ఇంకోసారి రాజ్యసభకు వెళ్లాలా ? వద్దా ? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను’’ అని ఆయన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ బిజీగా ఉన్నారు. ఇవాళ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన రిటైర్మెంట్‌పై(Sharad Pawar) కీలక ప్రకటన చేశారు.
Also Read :KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్
బారామతి స్థానంలో ఎన్‌సీపీ-అజిత్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ బరిలోకి దిగగా.. శరద్ పవార్ వర్గం ఎన్‌సీపీ-ఎస్‌పీ నుంచి అజిత్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ సొంత మేనల్లుడే ఈ అజిత్ పవార్. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి.. ఎన్‌సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్‌పై వ్యూహాత్మకంగానే యుగేంద్ర పవార్‌ను శరద్ పవార్ పోటీకి నిలిపినట్లు తెలుస్తోంది. ఇక్కడ ‘మేనల్లుడి’ ఫార్ములాను రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ ప్రయోగించడం గమనార్హం.
Also Read :US Election Winner : కాబోయే అమెరికా అధ్యక్షుడిపై హిప్పోల జోస్యం.. వీడియో వైరల్
లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తలపడ్డారు. అయితే విజయం మాత్రం సుప్రియనే వరించింది. ఎందుకంటే.. బారామతి అనేది శరద్ పవార్‌కు రాజకీయ కంచుకోట లాంటిది. మొత్తం మీద దాదాపు గత దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం శరద్ పవార్ సొంతం. ఆయన పలుమార్లు కేంద్రమంత్రిగా దేశానికి సేవలు అందించారు. శరద్ పవార్ కెరీర్ కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది. అయితే ఆయన మహారాష్ట్రలో సొంత రాజకీయ పార్టీని (ఎన్‌సీపీ) ఏర్పాటు చేసి కొత్త సమీకరణాలకు తెరలేపారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు.