Panch Vs Pati : రాజకీయ సాధికారత కోసం స్థానిక సంస్థల్లో మహిళలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్ల ద్వారా గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులుగా మహిళలు అవకాశాలను పొందుతున్నారు. అయితే చాలాచోట్ల ఆ పదవిలో పనిచేస్తున్నది మాత్రం వారి భర్తలే. తాజాగా ఈవిషయం నగ్నంగా అందరి ముందు సాక్షాత్కారమైంది.
ఆశ్చర్యకర కారణాలు..
‘పంచ్’(Panch Vs Pati) అంటే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు/సభ్యురాలు అని అర్థం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా పరస్వర గ్రామంలో వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆరుగురు మహిళలు పదవీ ప్రమాణ స్వీకారం చేయలేదు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారి భర్తలు ప్రమాణం చేశారు. మార్చి 3న ఈ ఘట్టం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆరుగురు మహిళలు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కావడానికి షాకింగ్ కారణాలను చెప్పారు. తాము సమీప బంధువుల అంత్యక్రియలకు హాజరుకావాల్సి ఉందని నలుగురు మహిళలు తెలియజేయగా, ప్రమాణ స్వీకారం చేయడానికి సిగ్గేస్తోందని మరో ఇద్దరు మహిళలు కారణాలుగా చెప్పడం గమనార్హం. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
Also Read :Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్‌డేట్స్
నెటిజన్ల రియాక్షన్
ఆ ఆరుగురి భర్తలు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళలు వార్డు సభ్యులుగా గెలిస్తే, వారి భర్తలు ప్రమాణం చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. భారత రాజ్యాంగం మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే.. వారికి కనీసం ప్రమాణ స్వీకారం చేసే స్వేచ్ఛను భర్తలు కల్పించకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. పురుషాధిపత్య వైఖరితోనే వారు తమ సతీమణులను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకొని ఉండొచ్చని పలువురు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని బిలాస్‌పూర్ జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. పరస్వర గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసింది. భార్యలకు బదులుగా భర్తలు ప్రమాణ స్వీకారం చేయడానికి చట్టం అనుమతించదని అధికారులు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.