Site icon HashtagU Telugu

Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్

Operation Sindoor Indian Army Pakistan Army India

Operation Sindoor :  పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్‌’ను యావత్ భారతీయులు స్వాగతిస్తున్నారు. భారత్ జరిపిన దాడిలో దాదాపు 90 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడ్డారని సమాచారం. ఈవివరాలను బయటికి వెల్లడించడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోంది. కేవలం 11 మందే చనిపోయారని బుకాయిస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ (బుధవారం) ఉదయం భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి, రక్షణ శాఖ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కీలక వివరాలను వెల్లడించారు. ‘‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్, పీఓకేలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.  ‘‘ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్(Operation Sindoor) మారింది. లష్కరే తైబాకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాదులే 26 మంది అమాయక భారతీయులను చంపారు. కుటుంబ సభ్యుల ఎదుట నిర్దాక్షిణ్యంగా వారిని కాల్చి చంపారు. ఈ దారుణాన్ని యావత్ భారతీయులు, భారత ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం’’ అని  విక్రమ్ మిస్రి చెప్పారు.

Also Read :Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ ట్వీట్.. అత్యవసర సమీక్ష

ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఉగ్రస్థావరాలు ధ్వంసం  

త్రివిధ దళాల అధిపతులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్

ఆపరేషన్ సిందూర్ పూర్తయ్యాక భారత త్రివిధ దళాల అధిపతులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేసి  మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.  దాడికి సంబంధించిన వివరాలను రాజ్‌నాథ్‌కు త్రివిధ దళాల అధిపతులు వివరించారు. భారత సరిహద్దులోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు రక్షణశాఖ సమీక్షిస్తోంది.

Also Read :Operation Sindoor: 9 ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్

అవసరమైతే.. ఆపరేషన్ సిందూర్ 2 

ఆపరేషన్ సిందూర్ అనేది పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మొదటి దశ  దాడి మాత్రమే అని సైనిక వర్గాలు అంటున్నాయి. ఒకవేళ భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే ఆపరేషన్ సిందూర్ 2 కూడా చేస్తారని చెబుతున్నారు.  ఆపరేషన్ సిందూర్‌పై కాసేపట్లో ప్రధాని  మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని అంటున్నారు.