Pooja Singhal : శ్రీల‌క్ష్మి త‌ర‌హాలో ఐఏఎస్ పూజ బ‌లి

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఈడీ దెబ్బ‌కు దొరికిపోయారు.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 02:10 PM IST

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఈడీ దెబ్బ‌కు దొరికిపోయారు. ఈడీ త‌నిఖీల్లో గుట్ట‌లుగా ప‌డి ఉన్న డ‌బ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ IAS అధికారి మరియు మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. మైనింగ్ మాఫియాతో క‌లిసి మ‌నీ లాండరింగ్ కు పాల్ప‌డిన‌ట్టు ప్రాథ‌మికంగా గుర్తించారు. ఆనాడు ఉమ్మ‌డి సీనియ‌ర్ అధికారిణి శ్రీల‌క్ష్మి త‌ర‌హాలోనే పూజా సింఘాల్ ప‌ట్టుబ‌డ్డారు.

MGNREGA నిధుల దుర్వినియోగం, ఇతర అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సీనియర్ IAS అధికారి మరియు మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. RTI ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం పెరిగిందని వర్గాలు పేర్కొన్నాయి. ఈడీ ఆమెను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచ‌గా ఐదు రోజుల రిమాండ్ విధించారు.

జార్ఖండ్ రాజ‌కీయం ఇప్పుడు పూజా సింఘాల్ అరెస్ట్ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నేతలు ఖండించారు. సీఎం హేమంత్ సోరెన్ ఆదేశానుసారంగా ఐఏఎస్ పూజా సింఘాల్ న‌డుచుకున్నార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. ఆమె చేసిన లావాదేవీల వెనుక హేమంత్ ప్ర‌మేయం ఉంద‌ని అనుమానిస్తున్నారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిణి అరెస్ట్ మ‌రో వైపు సీఎం రాజీనామా డిమాండ్ గ‌తంలో ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగిన మైనింగ్ అక్ర‌మ వ్య‌వ‌హారాల సీన్ గుర్తు కొస్తోంది.

ఉమ్మ‌డి ఏపీ సీఎంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు శ్రీల‌క్ష్మి మైనింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆమె ఓబులాపురం మైనింగ్ అనుమ‌తుల‌ను చ‌ట్ట‌విరుద్ధంగా ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్నారు. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ వైఎస్ రాజీనామాకు డిమాండ్ చేసిన సీన్ ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఆ త‌రువాత వైఎస్ మ‌ర‌ణించ‌డంతో అక్ర‌మాల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఫ‌లితంగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి శ్రీల‌క్ష్మి ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ తో స‌హా జైలు జీవితం అనుభ‌వించారు. ఇప్ప‌టికీ ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. సేమ్ టూ సేమ్ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అదే సీన్ క‌నిపిస్తోంది.

మైనింగ్ లో కూడ‌బెట్టిన డ‌బ్బుకు సంబంధించి మానీల్యాండ‌రింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లను ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఆ క్ర‌మంలో ఈడీ రంగంలోకి దిగి సీఎం అనుచ‌రులు, బంధువులు, స‌న్నిహితులు, అధికారుల ఇళ్ల‌లో త‌నిఖీల‌ను గ‌త కొన్ని రోజులుగా జ‌రుపుతోంది. వాళ్ల నుంచి పెద్ద ఎత్తున క‌రెన్సీ క‌ట్ట‌ల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం సీఎం హేమంత్ సొరేన్ కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది.