Site icon HashtagU Telugu

Robert Vadra : నేనూ పార్లమెంటుకు వెళ్తా.. రాబర్ట్ వాద్రా కీలక ప్రకటన

Robert Vadra Parliament Lok Sabha Rajya Sabha Cogress Priyanka Gandhi

Robert Vadra : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్డ్ వాద్రా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను కూడా పార్లమెంటుకు వెళ్తానన్నారు. ‘‘మన దేశంలోని విభజన శక్తులను ఎదుర్కోవడానికి పార్లమెంటులో మరిన్ని గళాలు అవసరం. క్షేత్రస్థాయిలో ఏ పని జరుగుతుందో.. ఏ మార్పులు అవసరమో నాకు బాగా తెలుసు’’ అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. తన భార్య ప్రియాంకా గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్లే తనకు రాజకీయాలపై అవగాహన పెరిగిందన్నారు. ‘‘ప్రియాంకా గాంధీ పార్లమెంటులో ఉండాలని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆమె పార్లమెంటు సభ్యురాలు అయ్యారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడే ప్రతీ ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోరితే కుటుంబ ఆశీర్వాదంతో నేను రాజకీయాల్లోకి వస్తాను’’ అని ఆయన వెల్లడించారు.

Also Read :Ashok Gajapathi Raju: గవర్నర్ పదవి రేసులో అశోక్ గజపతిరాజు

అమేథీ నుంచి పోటీ చేస్తారా ? 

‘‘దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతుంటారు. దీనికి కారణం వాళ్లు నా పనిని చూశారు. నేనూ పార్టీ నుంచి చాలానే నేర్చుకున్నాను’’ అని రాబర్ట్ వాద్రా చెప్పారు.  2029లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారా అని రాబర్ట్ వాద్రాను(Robert Vadra) ప్రశ్నించగా..  ‘‘ప్రస్తుతం కిషోరి లాల్ శర్మ అమేథీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసే వారికి అవకాశాలను ఇస్తుంది. స్మృతి జీకి వ్యతిరేకంగా ఆయన సరిపోతారని నేను భావిస్తున్నాను. ఆమెను ఓడించి కిషోరి లాల్ శర్మ ఎంపీగా గెలిచారు. కిషోరి లాల్ శర్మకు అమేథీలోని ప్రతి మూల తెలుసు. చాలా మంచి పని చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు నా పేరును రాజకీయ చర్చల్లోకి లాగాయి. ఎన్నికలు, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నా పేరును వాడుకున్నారు. అలాంటివన్నీ చూస్తే.. రాజకీయ ప్రతీకారం, కుట్రలలా కనిపిస్తుంటాయి. అందుకే ఇక నేను అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తాను’’ అని రాబర్ట్ వాద్రా తెలిపారు.

Also Read :Tamannaah : చెప్పులు లేకుండా.. ఎండలో.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. సినిమా కోసం తమన్నా కష్టాలు..

బిహార్ ఎన్నికల ప్రచారంపై.. 

బిహార్ ఎన్నికల ప్రచారం గురించి రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఆదేశిస్తే నేను ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తాను. నా మతపరమైన పర్యటనల్లో  భాగంగా బిహార్‌కు వెళ్తూనే ఉంటాను. గతంలో హర్యానా ప్రజల కోసం పని చేయాలని నేను భావించాను. అక్కడ భూమి కూడా కొన్నాను. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేశారు. వాటిపై హర్యానా ప్రభుత్వం విచారణ జరిపి, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’’ అని తెలిపారు. ‘‘మెహుల్ ఛోక్సీ లాంటి ఎగవేతదారులను అరెస్టు చేయడం ఎంత ముఖ్యమో..లూటీ చేసిన డబ్బులను  వారి నుంచి కక్కించడం అంతే ముఖ్యం’’ అని వాద్రా వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లను కూడా భారత్‌కు పట్టి తేవాలని డిమాండ్ చేశారు.