Sharad Pawar : తనకు వయసు మీద పడిందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఫైర్ అయ్యారు. తన ఫొటోతో పాటు 84 ఏళ్లు అని రాసి ఉన్న ప్లకార్డులతో కొందరు యువకులు నిలబడి ఉండగా చూశానని ఆయన మండిపడ్డారు. తన వయసును పదేపదే ఎత్తిచూపడం సరికాదన్నారు. ‘‘నా వయసు గురించి ఇతరులకు ఎందుకంత బాధ కలుగుతోందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. అలాంటి వాళ్లు ఇక బాధపడటం ఆపేయండి. మనది చాలా లాంగ్ జర్నీ. మహారాష్ట్రను సరైన దారిలో పెట్టేదాకా ఈ వృద్ధుడు ఆగిపోడు’’ అని శరద్ పవార్ చెప్పారు. ‘‘84 ఏళ్లు వచ్చినా.. 90 ఏళ్లు నిండినా మహారాష్ట్ర కోసం నేను శ్రమించడం ఆపను. మహారాష్ట్రను సరైన దారిలో పెట్టేవరకు విరామం తీసుకునేది లేదు. నా జర్నీని కొనసాగిస్తూనే ఉంటాను’’ అని శరద్ పవార్(Sharad Pawar) తేల్చి చెప్పారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో విభేదాలు వచ్చాయంటూ వచ్చిన ఊహాగానాలను శరద్ పవార్ ఖండించారు.
Also Read :Predator Drones : భారత్-అమెరికా బిగ్ డీల్.. రూ.29వేల కోట్లతో 31 ‘ఎంక్యూ9బీ’ ప్రిడేటర్ డ్రోన్లు
- మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
- ఈ ఏడాది నవంబరు 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
- ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి అధికారంలో ఉంది.
- ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
- శరద్ పవార్ వర్గం ఎన్సీపీ, ఉద్ధవ్ వర్గం శివసేన, కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
- ఈరోజు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
- ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది.
- దేశంలోని మూడు లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను కూడా ఇవాళే ఈసీ అనౌన్స్ చేయనుంది.