Tamil Nadu : తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాయినాథ్ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. అంతేకాక..పేలుడు ధాటికి నాలుగు భవనాలు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుంటే వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా ఫ్యాక్టరీలోని ముడిసరుకు నిల్వ చేసే గదిలో పేలుడు సంభవించిందని, సహాయక చర్యలు పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
గతేడాది అక్టోబర్‌లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.