Site icon HashtagU Telugu

Leopards : దేశంలో 13,874 చిరుతలు.. తెలంగాణ, ఏపీలో ఎన్నో తెలుసా ?

Leopards

Leopards

Leopards : మనదేశంలో ఎన్ని చిరుతపులులు ఉన్నాయి ? అనే లెక్క తేలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,874 చిరుతపులులు ఉన్నాయని తెలుపుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. 2018 సంవత్సరం నుంచి 2022 మధ్యకాలంలో దేశంలోని అడవుల నుంచి ఈ లెక్కలు సేకరించినట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా 3,907 చిరుతపులులు మధ్యప్రదేశ్‌లో  ఉన్నాయి. మహారాష్ట్రలో 1985, కర్ణాటకలో 1879, తమిళనాడులో 1070, ఆంధ్రప్రదేశ్‌లో 569, తెలంగాణలో 297 చిరుతలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించారు.  మునుపటితో పోలిస్తే మనదేశంలో చిరుతల(Leopards) సంఖ్య 1.08 శాతం పెరిగాయని రిపోర్టులో తెలిపారు. గత ఐదేళ్లలో చిరుతల సంఖ్య 1022 పెరగడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర సర్కారు దేశంలోని మొత్తం 18 రాష్ట్రాల్లో చిరుత పులులను లెక్కించింది. 4 ప్రధాన పులుల సంరక్షణ ప్రాంతాలలోని చిరుతల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ చిరుతల్ని ఎలా లెక్కించారనే విషయంలోకి వెళితే.. మొత్తం 6,61,449 కిలోమీటర్ల పరిధిలో చిరుతల పాద ముద్రలను గుర్తించారు. 32,803 ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి 4,70,81,81 చిరుతల ఫొటోలను తీశారు. వాటిలో 84,488 ఫొటోల్లో చిరుతలు కనిపించాయి. తద్వారా వాటిని లెక్కలోకి తీసుకున్నారు.

Also Read : Kate Middleton : కోమాలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ?

తెలంగాణలోని నాగార్జున సాగర్,  మధ్యప్రదేశ్‌లోని పన్నా, సాత్పూరా టైగ్ రిజర్వులలో ఉన్న ప్రాంతాల్లో చిరుతల సంఖ్య ఎక్కువగానే ఉంది. మనదేశంలోని తూర్పు కనుమల్లో కూడా చిరుతల సంఖ్య 1.5 శాతం పెరిగింది. అడవుల్ని నరికేయడం, వేటగాళ్లు చంపడం, చిరుతల మధ్య ఘర్షణలు వంటి అంశాలతో వాటి సంఖ్య కొన్ని చోట్ల తగ్గింది.  మన తెలంగాణ రాష్ట్రంలోనూ చిరుతల సంఖ్య తగ్గింది. ఏపీలో కొంత పెరిగింది. అడవులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో చిరుతల సంఖ్య కూడా తగ్గేదే. కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటం వల్ల వాటి సంఖ్య కొద్దిగా పెరిగిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అడవులు లేని ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఎడారులు, హిమాలయాల వంటి ఎత్తైన ప్రదేశాల్లోని చిరుతల్ని లెక్కించలేదు. అక్కడ వాటి సంఖ్య తక్కువగానే ఉంటుందనే ఉద్దేశంతో పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని  పులుల సంరక్షణను సర్కారు గాలికి వదిలేసిందా ? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది.

Exit mobile version