What is Bharatpol : ‘భారత్ పోల్’ పోర్టల్ వచ్చేసింది. విదేశాలకు పరారైన నేరగాళ్ల కేసుల దర్యాప్తు ఇక వేగాన్ని అందుకోనుంది. ఈ పోర్టల్‌ను ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తు విషయంలో ఇంటర్‌పోల్‌తో భారత్ తరఫున సీబీఐ మాత్రమే కోఆర్డినేషన్ చేసుకునేది. ఇక నుంచి భారత్ పోల్ పోర్టల్ వేదికగా అన్ని దర్యాప్తు సంస్థలు, అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు కూడా ఇంటర్‌పోల్‌తో టచ్‌లోకి వెళ్లగలుగుతాయి. భారత్ పోల్ పోర్టల్ నిర్వహణను సీబీఐ పర్యవేక్షించనుంది. వివిధ కేసుల విషయంలో కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పరం కోఆర్డినేషన్ చేసుకునేందుకు కూడా ఈ పోర్టల్(What is Bharatpol) దోహదం చేయనుంది. అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు సైతం పరస్పర సమన్వయం కోసం దీన్ని వాడుకోనున్నాయి. ఏదైనా రాష్ట్రంలో నమోదయ్యే కేసుకు సంబంధించిన దర్యాప్తులో అంతర్జాతీయ స్థాయి మద్దతు అవసరమైతే ఇక నుంచి ఆ రాష్ట్ర పోలీసు శాఖ భారత్ పోల్ పోర్టల్‌ను వాడుకోవచ్చు. నేరుగా ఇతర రాష్ట్రాల పోలీసులతో, కేంద్ర దర్యాప్తు సంస్థలతో, ఇంటర్ పోల్‌తో సంప్రదింపులు జరపొచ్చు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.
Also Read :Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు
ఏ కేసు అయినా సరే అది త్వరగా పరిష్కారం కావాలంటే విచారణ వేగవంతంగా జరగాలి. విచారణ వేగంగా, సవ్యంగా పూర్తయితేనే త్వరగా దోషులకు శిక్ష పడుతుంది. ఈ దిశగా భారత్ పోల్ పోర్టల్ కొత్త బాటలు వేయబోతోంది. ప్రత్యేకించి నిందితులు, నేరగాళ్లు విదేశాలకు పరారైన కేసుల్లో సత్వర విచారణకు, వారిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ పోర్టల్ చేదోడును అందించనుంది. ఇంటర్ పోల్ సహకారాన్ని పొందేందుకు పోలీసులకు అవసరమైన టెక్నికల్ టూల్స్‌ను సైతం సమకూర్చనుంది. మొత్తం మీద దేశంలోని దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చే విషయంలో దీన్ని కీలకమైన ముందడుగుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.