Amit Shah In Bastar : బస్తర్.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టుల కంచుకోట. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బస్తర్ పరిధిలో ఒకరాత్రి బస చేయాలని ఆయన డిసైడయ్యారు.వాస్తవానికి ఇవాళే(శనివారం) అమిత్ షా ఛత్తీస్‌గఢ్ పర్యటన మొదలైంది. అయితే ఈ పర్యటనలో కీలక ఘట్టం రేపు(ఆదివారం) జరగబోతోంది. ఆదివారం ఉదయం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పలువురు రాష్ట్ర పోలీసులకు ‘ప్రెసిడెంట్స్ కలర్’ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది అక్టోబరు నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినందుకు రాష్ట్ర పోలీసులను ‘ప్రెసిడెంట్స్ కలర్’ పురస్కారం వరించింది. ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అమిత్ షా నేరుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం జగదల్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్ ఏరియాకు వెళ్తారు. మావోయిస్టుల వల్ల ప్రతికూలంగా ప్రభావితులైన ప్రజలను కలిసి వారి సాధకబాధకాలను ఆయన అడిగి తెలుసుకుంటారు. సరెండర్ అయిన మావోయిస్టులను కూడా అమిత్‌షా కలుస్తారు. ప్రస్తుతం వారి జీవితాలు ఎలా ఉన్నాయనేది ఆయన తెలుసుకుంటారు.
Also Read :Mohan Babu : ఇంట్లోనే ఉన్నాను, పారిపోలేదు.. దయచేసి నిజాలే చెప్పండి : మోహన్ బాబు
నవంబరు 5వ తేదీ నుంచి కొన్ని వారాల పాటు జరిగిన బస్తర్ ఒలింపిక్స్‌లో(Amit Shah In Bastar) పాల్గొన్న క్రీడాకారులను సైతం కేంద్ర హోంమంత్రి కలుస్తారు. ఈ పోటీల్లో బస్తర్ ప్రాంతం పరిధిలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన కాంకేర్, కొండగావ్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ, నారాయణ్ పూర్‌లకు చెందిన యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల ముగింపు వేడుకలు ఆదివారం సాయంత్రం జగదల్‌పూర్‌లో జరుగుతాయి. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సుక్మా, బీజాపూర్ లేదా నారాయణపూర్ జిల్లాల పరిధిలోని ఏదైనా ఒక భద్రతా బలగాల క్యాంపులో అమిత్‌షా రాత్రిబస చేస్తారని తెలుస్తోంది. మన దేశ హోంమంత్రి ఈవిధంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఒక రాత్రి బస చేయడం అనేది ఇదే తొలిసారి. దీనిపై ఇప్పటిదాకా అధికారిక సమాచారమేదీ బయటకు రాలేదు. బస్తర్ ప్రాంతంలో ఒక రాత్రి గడపడం ద్వారా అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని అమిత్‌షా భావిస్తున్నారు.
Also Read :WhatsApp New Features : వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్.. మరో నాలుగు కొత్త ఫీచర్లు
హిడ్మా సొంతూరు పువర్తికి అమిత్‌షా..
అమిత్‌షా పర్యటనలో ప్రధానంగా రెండు ప్రదేశాలపై దృష్టి నిలుస్తుంది. అవి.. సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామం, నారాయణపూర్ జిల్లాలోని అబూఝ్మాడ్. పువర్తి గ్రామం విషయానికొస్తే.. మావోయిస్టు నేత మాడ్వీ హిడ్మా పువర్తి గ్రామస్తుడే. అతడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. హిడ్మా మావోయిస్టుల సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అతడి తలపై రూ.1 కోటిపైగా రివార్డు ఉంది. ఇంత సున్నితమైన పువర్తి గ్రామంలో అమిత్‌షా పర్యటించనుండం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అబూజ్‌మడ్‌లో అమిత్‌షా
నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట. ఇక్కడ ఆర్మీ క్యాంపును ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా అమిత్‌షా పరిశీలించనున్నారు. ఈసందర్భంగా స్థానికులతో ఆయన భేటీ కానున్నారు.