Stampede incident : బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. అధిక సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు రావడంతో ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వేదిక వద్ద భద్రతా చర్యలు సమర్థవంతంగా లేకపోవడం, ప్రజా నియంత్రణలో పాలిసుల విఫలం ఈ విషాదానికి కారణంగా పేర్కొనబడింది.
Read Also: Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. దుర్ఘటన జరిగిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక, ఘటనపై మేజిస్టీరియల్ స్థాయిలో విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రాకపై అధికారులు సరైన అంచనా వేయకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని సీఎం వ్యాఖ్యానించారు.
ఈ సంఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుంది. ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యం అని జేడీ(ఎస్), బీజేపీ నాయకులు మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వారికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందిస్తూ దీన్ని “హృదయ విదారక ఘటన”గా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, హైకోర్టు జోక్యం కలగడంతో రాష్ట్ర ప్రభుత్వపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వ నివేదికలపై న్యాయస్థానం సమగ్ర పరిశీలన చేపట్టనుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన, ఎలాంటి ఉత్సవాల్లోనైనా ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంత గొప్పదో మళ్లీ గుర్తు చేసింది. ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, మరియు క్రికెట్ బోర్డు మధ్య సమన్వయం లేకపోవడమే ప్రాణనష్టం వరకు దారితీసింది. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇదే.
Read Also: Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!