Delhi High Alert : భారతదేశం విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌కు అసహనాన్ని కలిగిస్తోంది. భారత దళాల ఈ సుదీర్ఘ సర్జికల్ ఆపరేషన్ వల్ల పాక్ మానసికంగా తట్టుకోలేక రెచ్చిపోయింది. దీనితో పాటు, భారత్‌పై విద్వేషాత్మక వ్యాఖ్యలు, దౌర్జన్య చర్యలు ప్రారంభించడంతో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నగరంలో అత్యధిక భద్రత చర్యలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, వారి హాజరును తప్పనిసరిగా చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ప్రజలను ఆ ప్రాంతం విడిచి వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Sirens : మరోసారి చండీగఢ్‌లో మోగిన సైరన్లు.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఎయిర్‌ఫోర్స్ హెచ్చరికలు
రాత్రివేళల్లోనూ పోలీసు బలగాలు విస్తృత నిఘా చేపడుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తూ అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వైద్య, విపత్తు నిర్వహణ శాఖల సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా దిల్లీకి వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే పలు విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. ప్రజలకు ప్రయాణానికి ముందు అధికారిక సమాచారం తెలుసుకుని కదలాలని సూచనలు అందుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర విభాగం ఆసుపత్రులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఔషధ నిల్వలు, ప్రాణాధార పరికరాలు, బెడ్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇదే తరహాలో చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతుండగా, కేంద్రం అన్ని రంగాల్లో సమన్వయంతో స్పందిస్తున్నట్టు సమాచారం.