Ganesh Immersion : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భద్రతా వ్యవస్థలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. నగరంలోని ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఉగ్ర బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందేశం నగరాన్ని షాక్‌కు గురిచేసింది. ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన ఈ మెసేజ్‌లో, నగరంలో 34 వాహనాల్లో మానవ బాంబులను అమర్చామని, వాటి ద్వారా 400 కేజీల ఆర్డీఎక్స్ పేల్చేలా ప్రణాళిక తయారు చేసినట్టు ఉగ్రవాదులు పేర్కొన్నారు. పోలీసుల సమాచారం మేరకు, ఈ పేలుళ్ల వల్ల కోటి మందికి పైగా ప్రాణనష్టం కలగొచ్చని, నగరమంతా భయపడి, కలత చెంది పోవడం ఖాయమని మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపు లష్కర్-ఎ-జిహాదీ అనే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిందని అధికారులు ధృవీకరించారు. ఇంకా ఆ సంస్థ తరఫున 14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించారని సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: Thailand : థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్
ఈ సంఘటన నేపధ్యంలో, ముంబై నగరంలో పోలీసులు హై అలర్ట్ విధించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు చేరుతుండగా, ఈ భద్రతా హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ముంబై ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన నగరం. వేలాది గణపతి మండపాలు, లక్షలాది భక్తులు వీధుల్లో సందడి చేస్తారు. అటువంటి సమయంలో ఉగ్రదాడుల బెదిరింపులు ప్రజల్లో భయం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారణ ప్రారంభించారు. అదేవిధంగా ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇంటెలిజెన్స్ బ్యూరో, NIA వంటి సంస్థలు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని ముమ్మర తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్‌లు, ప్రజలు ఎక్కువగా కూడిన ప్రాంతాల్లో భద్రతను బలపరిచారు. శంకాస్పదంగా కనిపించే వ్యక్తులపై నిఘా పెంచారు.
పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారిక నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో, నగరంలోని ప్రజలు, భక్తులు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబై పోలీసులు ప్రజల భద్రత కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.