Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!

Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మా ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌లో హతమవడంతో దశాబ్దాలుగా దండకారణ్యాన్ని కుదిపేస్తున్న మావోయిస్టు శక్తికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Maoist Hidma

Maoist Hidma

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మా ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌లో హతమవడంతో దశాబ్దాలుగా దండకారణ్యాన్ని కుదిపేస్తున్న మావోయిస్టు శక్తికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా, కేవలం గ్రామీణ యువకుడిగా ప్రారంభమైన తన ప్రయాణాన్ని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కమాండ్ స్థాయికి తీసుకెళ్లాడు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఆయన, ఘోర దాడుల వ్యూహకర్తగా కేంద్ర బలగాలకు ఎప్పుడూ సవాల్ విసిరాడు. చిన్న వయసులోనే PLGA 1వ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, అడవుల్లో భద్రతా బలగాల కదలికలను గమనించి దాడులు జరపడం హిడ్మా నైపుణ్యంగా మారింది.

Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?

హిడ్మా పేరు దేశవ్యాప్తంగా భయానకంగా మారడానికి కారణమైన దాడులు చాలానే ఉన్నాయి. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది CRPF జవాన్లు మరణించగా, 2013 జిరామ్ ఘాట్ దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 27 మంది మరణించారు. 2021లో సుక్మా–బీజాపూర్ సరిహద్దులో జరిగిన దాడిలో 22 మంది బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ మూడు దాడులు హిడ్మాను అడవిలో అత్యంత ప్రమాదకర నాయకుడిగా నిలబెట్టాయి. ఆయనతో పాటు రాజే అలియాస్ రాజక్క, స్టేట్ జోనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే వంటి కీలక సభ్యుల హతం మావోయిస్టు శక్తికి భారీ నష్టం. ముఖ్యంగా రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉండటం, ఆమె కూడా మృతి చెందడం ఈ ఆపరేషన్ ప్రాముఖ్యతను మరింత పెంచింది.

ఇటీవల హిడ్మా సుమారు 200 మంది మావోయిస్టులతో కలిసి సరెండర్‌ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాడనే సమాచారం వెలువడింది. అయితే అతను ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో దాగి ఉన్నాడని ఇంటెలిజెన్స్ నివేదికలతో పోలీసులు కూంబింగ్‌ను వేగవంతం చేశారు. అర్ధరాత్రి నుంచి కొనసాగిన ఆపరేషన్ ఉదయం ఎదురుకాల్పులకు దారితీసింది. హిడ్మా మృతితో అడవుల్లో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర మావోయిస్టులతో కలిసి అనేక వ్యూహాలు రూపొందించిన హిడ్మా లేకపోవడం మావోయిస్టు సంస్థను నాయకత్వ సంక్షోభంలోకి నెడతుందని అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలను ఛేదించిన హిడ్మా హతంతో దండకారణ్యంలో నక్సల్ ఉద్యమానికి ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.

  Last Updated: 18 Nov 2025, 01:02 PM IST