Site icon HashtagU Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్‌మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ

Vyomika Singh Sophia Qureshi Operation Sindoor India Pakistan Pok

Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ ఎటాక్ .. ఇవాళ (బుధవారం) యావత్ భారతదేశంలో చర్చనీయాంశం. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత ఆర్మీ ఎలా ధ్వంసం చేసింది ? ఏయే ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది ? అనే వివరాలను ఈరోజు ఉదయం ఇద్దరు మహిళా సైనికాధికారులు విలేకరులకు వివరించారు. ఇంతకీ వారెవరు ? నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం..

సోఫియా ఖురేషీ గురించి..

సోఫియా ఖురేషీ గుజరాత్‌ వాస్తవ్యురాలు. ఆమె బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు. సోఫియా తాతయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తాతయ్య నుంచి స్ఫూర్తి పొంది దేశభక్తి భావంతో..  17 ఏళ్ల వయసులో 1999లో భారత సైన్యంలో సోఫియా ఖురేషీ చేరారు. సోఫియా భర్త కూడా భారత ఆర్మీలోనే పనిచేస్తున్నారు. ఆయన ఆర్మీలోని మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ అధికారిగా సేవలు అందిస్తున్నారు.  అంటే దంపతులు ఇద్దరూ మిలిటరీలోనే ఉన్నారు. 2016 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో మల్టీనేషనల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ ‘ఫోర్స్ 18’ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆసియాన్ దేశాల సైన్యాలు పాల్గొన్నాయి. మనదేశంలో జరిగిన అతిపెద్ద గ్రౌండ్‌ఫోర్సెస్ ఎక్సర్‌సైజ్ ఇదే. ఇందులో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సోఫియా ఖురేషీ(Operation Sindoor) సారథ్యం వహించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సోఫియా ఆరేళ్లు పనిచేశారు. 2006లో ఆమె కాంగోలో సేవలు అందించారు. ప్రస్తుతం భారత ఆర్మీలో కల్నల్ హోదాలో సోఫియా సేవలు అందిస్తున్నారు.

వ్యోమికా సింగ్ గురించి..

వ్యోమికా సింగ్ విద్యార్థి దశ నుంచే  నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ (ఎన్‌సీసీ)లో శిక్షణ పొందారు.  ఆమె ఇంజినీరింగ్ చేశారు. వ్యోమికా సింగ్ భారత వాయుసేనలో హెలికాప్టర్ పైలట్. 2019లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పైలట్‌‌గా శాశ్వత హోదాను దక్కించుకున్నారు. ఆమెకు పైలట్‌గా 2500 గంటలకుపైగా హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఉంది. కశ్మీరుతో పాటు ఈశాన్య భారత్‌లోని క్లిష్ట పరిస్థితుల్లో చేతక్ – చీతా వంటి హెలికాప్టర్లను నడిపిన అనుభవం వ్యోమికా సింగ్ సొంతం.అనేక రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ హోదాలో ఉన్నారు.

Exit mobile version