Aircraft Accidents : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-171) మధ్య గగనంలో ఘోర ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు హుటాహుటిన కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, టెక్నికల్ ఫాల్ట్ కారణంగా విమానం ఆకాశంలోనే అదుపు తప్పి కూలిపోయినట్టు అనుమానిస్తున్నారు. విమాన ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు ఈ దుర్ఘటనను గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోరమైనదిగా పేర్కొంటున్నారు. గతంలో దేశంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన విమాన ప్రమాదాలను చూస్తే ఈ ప్రమాద తీవ్రత మరింత స్పష్టమవుతుంది.
2020లో కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన వందే భారత్ మిషన్”లో భాగంగా, దుబాయ్ నుంచి కేరళలోని కొయ్‌కోడ్‌కి బయలుదేరిన బోయింగ్ 737-800 విమానం వర్షం కారణంగా రన్‌వేపై అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 21 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
2010 మేలో, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX-812) రన్‌వే దాటి లోయలోకి దూసుకెళ్లి మంటలు అంటుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న 166 మంది ప్రవాస భారతీయులలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు.
1998లో, పట్నా విమానాశ్రయ సమీపంలో ఆలయన్స్ ఎయిర్ బోయింగ్ 737-2A8 విమానం జనావాసాల్లోకి దూసుకెళ్లి పేలింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, 5 మంది స్థానికులు మృతి చెందారు.
1996లో, హరియాణాలో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానం 763, కజకిస్తాన్ విమానం 1907 గాలిలో ఢీకొన్న ఘటనలో 340 మందికిపైగా మృతి చెందారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘోరమైన మిడ్-ఎయిర్ కొలిజన్‌లలో ఒకటి.
1993లో, ఔరంగాబాద్ విమానాశ్రయం వద్ద టేకాఫ్ సమయంలో రన్‌వేపై ఉన్న ట్రక్కును ఢీకొన్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు వ్యాపించి 118 మంది మరణించారు.
1990లో, బెంగళూరు విమానాశ్రయంలో విమానం 605 రన్‌వేను తాకడంతో జరిగిన ప్రమాదంలో 92 మంది సిబ్బంది సహా 146 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదం, విమాన ప్రయాణ భద్రతపై అనేక ప్రశ్నలు రేపుతోంది. విచారణ కొనసాగుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో భయం నెలకొంది. మరిన్ని వివరాల కోసం అధికారిక సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది.