Site icon HashtagU Telugu

Jharkhand : 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

Hemant Soren takes oath as Jharkhand 14th chief minister

Hemant Soren takes oath as Jharkhand 14th chief minister

Hemant Soren: ఝార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో ఝార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో గురువారం సాయంత్రం ఘనంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. హేమంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సహా తదితర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.ఇక ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హేమంత్ సోరెన్‌కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఇటీవల ఎన్నికల్లో 81 స్థానాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన విషయం తెలిసిందే. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 2, ఏజేఎస్‌యూపీ, లోక్ జనశక్తిపార్టీ (రాంవిలాస్), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. దీంతో జేఎంఎం నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో తాజాగా కొలువుదీరింది.

ఇకపోతే..హేమంత్‌ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే..ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదు నెలల అనంతరం జైలు నుంచి విడుదలయిన హేమంత్‌, మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. తన సతీమణి కల్పనా సోరెన్​తో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టి పార్టీని విజయానికి కృషి చేశారు.

Read Also: Keerthy Suresh : పెట్ పేరుతో ఎప్పుడో హింట్ ఇచ్చిన కీర్తి..!