Crocodiles Rescued : గుజరాత్ రాష్ట్రంలోని చాలా జిల్లాలను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే నదీపరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదల పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. వడోదర జిల్లా మీదుగా విశ్వామిత్రి అనే నది ప్రవహిస్తుంటుంది. భారీ వర్షాలకు ఆ నది పొంగిపొర్లుతోంది. ఆ నది నుంచి వడోదరలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. ఈ వరద నీటిలో పెద్దసంఖ్యలో మొసళ్లు ఉంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈవిధంగా వరదనీటిలో కొట్టుకొని వచ్చిన 24 మొసళ్లను ఆగస్టు 27 నుంచి ఆగస్టు 29 మధ్యకాలంలో అటవీ అధికారులు పట్టుకొని మళ్లీ విశ్వామిత్రి నదిలో వదిలారు. వరద నీటితో పాటు ఈ మొసళ్లు(Crocodiles Rescued) నేరుగా తమ ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు పడిన హైరానా అంతాఇంతా కాదు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా కూడా వైరల్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
దీనిపై వడోదర ప్రాంత అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. “సాధారణంగా, మొసళ్ళు మనుషులపై దాడి చేయవు. అవి నదిలోని చేపలు, జంతువుల కళేబరాలను తిని జీవిస్తుంటాయి. కుక్కలు, పందులు లేదా మరేవైనా చిన్న జంతువులను చంపి తింటుంటాయి’’ అని తెలిపారు.వడోదర జిల్లాలోని విశ్వామిత్రి నదిలో దాదాపు 440 మొసళ్లు ఉన్నట్లు అంచనా. ఈ నదికి ఎగువ ప్రాంతంలో ఉన్న అజ్వా డ్యామ్ నుంచి అకస్మాత్తుగా నీటిని దిగువకు వదిలారు. దీంతో విశ్వామిత్రి నది పొంగిపొర్లింది. దీంతో నది తీర ప్రాంతంలోని లోతట్టు ఏరియాలను వరద నీరు ముంచెత్తింది. ఒకవేళ వరదపోటు ఇంకా ఎక్కువ ఉండి ఉంటే.. వందలాది మొసళ్లు ఆయా ఏరియాలకు చేరి ఉండేవి.
“మేం రక్షించిన ఒక మొసలి రెండు అడుగుల పొడవు ఉంది. మరో మొసలి 14 అడుగుల పొడవు ఉంది. 11 అడుగుల పొడవున్న మరో రెండు మొసళ్లను కూడా రక్షించాం’’ అని అటవీ అధికారులు తమ రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరించారు. వీటితో పాటు పాములు, నాగుపాములు, దాదాపు 40 కిలోల బరువున్న ఐదు పెద్ద తాబేళ్లు, ఒక పందికొక్కు, మరో 75 జంతువులను కూడా రక్షించామన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘అస్నా’ తుఫాను ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షం కురుస్తోంది. వరదల కారణంగా వడోదర నగరానికి చెందిన 5,000 మందికి పైగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 12,000 మందికి పైగా ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.