Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ‘తీవ్ర స్థాయి’లో (సెవర్ ప్లస్) తగ్గిపోయింది. ఈ తరుణంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఢిల్లీ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రేప్) -4కు సంబంధించిన నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే గ్రేప్-4 నిబంధనలను అమల్లోకి తెచ్చి ఉండాల్సిందని, ఈవిషయంలో కేంద్ర, రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేశాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం(Delhi Pollution) ఆదేశాలు జారీ చేసింది.
Also Read :Nayanthara Birthday : నయనతార బర్త్‌డే సర్‌ప్రైజ్ ‘రక్కయీ’.. ఆమెకు పేరు పెట్టిందెవరు ? రెమ్యునరేషన్ ఎంత ?
ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపే క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు వాయు కాలుష్యం కట్టడికి ఏమేం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తమ అనుమతి లేకుండా గ్రేప్-4 నిబంధనల అమలును ఉపసంహరించుకోవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
Also Read :Nuclear Weapons : భారీగా అణ్వాయుధాలు రెడీ చేయండి.. కిమ్ సంచలన ఆర్డర్స్
ఈక్రమంలో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘మరో రెండు, మూడు రోజులు మానిటర్ చేశాక.. గ్రేప్-4 నిబంధనలు అమలు చేస్తాం’’ అని తెలిపారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘గాలి నాణ్యత తగ్గుతోందని తెలిసి కూడా అలాంటి రిస్క్ ఎలా చేస్తారు? ఇంకా మూడు రోజులు వెయిట్ చేయడం ఎందుకు ?’’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘‘ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయులు తగ్గుతాయని మేం భావిస్తున్నాం’’ అని గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి కోర్టు స్పందిస్తూ.. ‘‘ఆ విషయాన్ని కచ్చితంగా ఎవరు చెప్పగలరు ? ’’ అని నిలదీసింది. గ్రేప్-4 నిబంధనలను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.