Google Doodle : ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ ప్రతిరోజూ ఒక్కో రకమైన డూడుల్‌ను మన ముందుకు తెస్తుంటుంది. గూగుల్ సెర్చింజన్‌కు ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేక హోంపేజీ ఉంటుంది. మన దేశానికి సంబంధించిన హోంపేజీలో ప్రత్యేక దినాలు, సందర్భాల్లో భారతీయతను ఉట్టిపడే డూడుల్స్‌ను ప్రదర్శిస్తుంటారు. ఇవాళ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని గొప్ప జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ వన్యప్రాణులతో కూడిన డూడుల్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ క్లిక్ చేసి మీరు కూడా దాన్ని చూడొచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జంతువులను ఈ డూడుల్‌లో(Google Doodle) చక్కగా చూపించారు. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన పశ్చిమ కనుమలలోని పచ్చని వర్షారణ్యాల వరకు దీనిలో చోటు ఇచ్చారు.
Also Read :Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సందడి
చిత్రీకరణ వెనుక..
గూగుల్ డూడుల్ ఇన్ఫో పోర్టల్ ప్రకారం.. ఈ డూడుల్‌ను మహారాష్ట్రలోని పూణేకు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడుల్‌లో చూపించిన వివిధ రకాల జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేక వైవిధ్యానికి ప్రతీకలు. ఇవన్నీ కలిసి పరేడ్ చేస్తున్నట్లుగా ఈ డూడుల్‌లో క్రియేటివ్‌గా చూపించారు. రిపబ్లికన్ డే రోజున న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పరేడ్ జరుగుతుంటుంది.జనవరి 29న బీటింగ్ రిట్రీట్‌తో ఈ వేడుకలు ముగుస్తాయి.
Also Read :Kirti Chakra Awards 2025 : కీర్తి చక్ర అవార్డు అందుకున్న వారు వీరే
డూడుల్ గురించి ఆర్టిస్ట్ రోహన్ దహోత్రే..
‘‘భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, భౌగోళిక అందాలను ప్రదర్శించడంతో పాటు వాటితో ముడిపడిన లోతైన సందేశాలను పంచుకోవడమే నేను గీసిన డూడుల్ లక్ష్యం’’ అని ఆర్టిస్ట్ రోహన్ దహోత్రే వివరించారు. ‘‘భారత్‌లో ఎడారులు, చిత్తడి నేలలు, గడ్డి భూములు, సరస్సులు, సముద్రాల వంటివన్నీ ఉన్నాయి. ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలం సైతం ఉన్నాయి’’ అని ఆయన గుర్తు చేశారు. ‘‘ఈ డూడుల్ మన దేశంలో ఉన్న అపురూపమైన వన్యప్రాణుల గురించి అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను. భూగ్రహం మానవులకు మాత్రమే చెందినది కాదు. వాతావరణ మార్పు అనేది ఒక ముఖ్యమైన వాస్తవం. ఈ గ్రహంపై మనతో పాటు నివసిస్తున్న అసాధారణ జీవజాతులపై స్పృహతో మనిషి జీవించాలి’’ అని రోహన్ దహోత్రే తెలిపారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వ భావనతో ముందుకుసాగడం అనేదే గణతంత్ర దినోత్సవం మనకు బోధించే సందేశం. విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు దేశం కోసం ఒకటయ్యారు. ఈ సూత్రాన్ని భారతదేశం దాటి ప్రపంచమంతటికీ విస్తరించాలని నేను నమ్ముతున్నాను. 21వ శతాబ్దం యుద్ధం కోసం కాదు, శాంతి కోసం నిలబడాలి’’ అని ఆయన చెప్పారు.
