Train General Coaches : రైళ్లలోని జనరల్ బోగీలు సామాన్యులు, మధ్యతరగతి వర్గం ప్రయాణికులకు చాలా ముఖ్యమైనవి. వాటిలోనే చాలామంది ప్రయాణిస్తుంటారు. టికెట్ రేటు తక్కువగా ఉండటంతో రైళ్లలోని జనరల్ బోగీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే.. జనరల్ బోగీల్లోని సీట్ల సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా టికెట్లు సేల్ అవుతుంటాయి. ఈ బోగీలు తక్కువ సంఖ్యలో ఉండటంతో.. ఉన్నవాటిలోనే జనం కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. మొత్తం మీద జనజీవితంతో ముడిపడిన ఈ అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిగణనలోకి తీసుకుంది.
Also Read :Biggest Fights In IPL: ఐపీఎల్ చరిత్రలో జరిగిన బిగ్గెస్ట్ ఫైట్స్!
రెండు చొప్పున జనరల్ బోగీలు ఉన్న రైళ్లలో.. వాటి సంఖ్యను నాలుగుకు(Train General Coaches) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లుగా రైళ్లలో జనరల్ కోచ్‌లుగా పాతకాలం నాటి బోగీలే ఉన్నాయని.. ఇకపై కొత్త తరం ఎల్‌హెచ్‌బీ బోగీలను జనరల్ కోచ్‌లుగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. పాతతరం ఐసీఎఫ్ రకం రైలు బోగీల్లో 90 సీట్లే ఉంటాయి. కొత్త తరం ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 100 సీట్లు ఉంటాయి. ప్రమాదాలు జరిగినా నష్టం తక్కువగా సంభవిస్తుంది. రైల్వే జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనంగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో విడతల వారీగా జనరల్ బోగీలను పెంచుతామని వెల్లడించింది.
Also Read :Prithvi Shaw: కష్టాల్లో ఫృథ్వీ షా.. దేశీయ టోర్నీలోనూ విఫలం!
గౌతమి, దక్షిణ్, నారాయణాద్రి సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌హెచ్‌బీ రకానికి చెందిన జనరల్ బోగీలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్ బోగీలను దశలవారీగా జత చేస్తోంది. ఫలితంగా రోజూ అదనంగా 70 వేల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించే ఛాన్స్ కలుగుతుంది.