Site icon HashtagU Telugu

Rajnath Singh : భవిష్యత్ యుద్ధాలు పూర్తిగా భిన్నంగా మారనున్నాయి: రాజ్‌నాథ్ సింగ్

Future wars will be completely different: Rajnath Singh

Future wars will be completely different: Rajnath Singh

Rajnath Singh : భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం సంపూర్ణంగా మారనుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆయుధాలతో మాత్రమే కాకుండా, సైబర్ యుద్ధాలు, మానవరహిత డ్రోన్లు, ఉపగ్రహాల ఆధారిత నిఘా, ఆర్థిక వ్యవస్థపై దాడులు, కుతంత్ర దౌత్యం వంటి అంశాలు యుద్ధం యొక్క కీలక భాగాలు అవుతున్నాయని వివరించారు. ఈ మారుతున్న యుద్ధ ప్రణాళికలకు అనుగుణంగా దేశాలు తమ రక్షణ వ్యవస్థలను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన రణ్-సంవాద్ 2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..యుద్ధం (రణ్‌) మరియు సంభాషణలు (సంవాద్‌) ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించవచ్చుగానీ, నిజానికి ఇవి పరస్పరం అనుబంధంగా ఉంటాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారానే యుద్ధాలను నివారించవచ్చు అని పేర్కొన్నారు.

భారతదేశం ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించే ధోరణిలోనే ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. అయితే, భారత స్వాధీనతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వారిని తగిన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో భారత్‌ ప్రపంచానికి తన సాంకేతిక నైపుణ్యాన్ని మరియు వ్యూహాత్మక శక్తిని స్పష్టంగా చాటిందన్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఉగ్రవాదులకు గుర్తించలేనివిధంగా ప్రతీకారం తీర్చిందని వివరించారు. ఇది భవిష్యత్తులో జరిగే సాంకేతిక ఆధారిత యుద్ధాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రపంచం వేగంగా మారిపోతుంది. అంతర్జాతీయ రాజకీయాలు, భద్రతా పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం డైనమిక్‌గా మారుతున్నాయి. ఈ మార్పులకి అనుగుణంగా మన బలగాలను మేము సిద్ధం చేయాలి అని తెలిపారు. ఇందుకు తోడుగా రుద్ర, శక్తిబాన్ రెజిమెంట్‌లు, దివ్యాస్త్ర బ్యాటరీలు, డ్రోన్ ప్లాటూన్లు వంటి యూనిట్ల ఏర్పాటు కోసం భారత సైన్యం ముందడుగు వేస్తోందన్నారు.

భారత నావికాదళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ క్రమంలో ఇటీవల ప్రారంభించిన INS హిమగిరి మరియు INS ఉదయగిరి నౌకలు దీనికి నిదర్శనమన్నారు. స్వదేశీ ఆయుధాల తయారీ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని ముందుంచుకుని కీలక చర్యలు చేపడుతోందని చెప్పారు. భారత్‌లో తయారయ్యే ఆయుధాలు, క్షిపణులు, రక్షణ పరికరాల ప్రోత్సాహంతో దేశ రక్షణలో స్వావలంబన పెరుగుతుందని రాజ్‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, సాంకేతికత ఆధారిత యుద్ధాల ప్రభావం బలంగా కనిపిస్తోందన్నారు. కాబట్టి, రాబోయే కాలానికి తగినట్లుగా రక్షణ రంగంలో వ్యూహాత్మక మార్పులు అవసరమని, ఆ దిశగా భారత్‌ ఇప్పటికే అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

Read Also: Hyderabad: ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ