Site icon HashtagU Telugu

Manipur Violence : బాంబులతో చెలరేగిన తీవ్రవాదులు.. పోలీస్ కమాండో మృతి

Manipur Violence

Manipur Violence

Manipur Violence : మణిపూర్ మరోసారి హింసతో అట్టుడికింది. మయన్మార్ దేశ బార్డర్‌లో ఉన్న మోరే పట్టణంలో కుకీ వర్గానికి చెందిన తీవ్రవాదులు చెలరేగారు. బుధవారం ఉదయం మోరే పట్టణ శివార్లలోని సెక్యూరిటీ చెక్ పోస్టుపైకి దుండగులు బాంబులు విసిరారు. ఆర్‌పీజీ షెల్స్‌ను ప్రయోగించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది, పోలీసులపైకి కాల్పులు జరిపారు. పరిసరాల్లో ఆగి ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. దుండగులు జరిపిన ఈ దాడిలో మణిపూర్ పోలీసు కమాండో వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్‌ మరణించారు. ఆయన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌(IRB)లో సేవలు అందించేవారు. వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్‌ ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని మాలోమ్‌కు(Manipur Violence) చెందినవారు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది అక్టోబరులో పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) సీహెచ్‌ ఆనంద్‌ హత్య కేసులో మోరే పట్టణానికి చెందిన ఫిలిప్ ఖోంగ్‌సాయి, హేమోఖోలాల్ మేట్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రత్యేక టీమ్ మోరే పట్టణానికి వచ్చి ఇద్దరు నిందితులను సోమవారం రోజు అరెస్టు చేసింది. వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టగా..  9 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత (బుధవారం).. మోరే పట్టణంలోని ఏడో నంబర్ వార్డు వద్ద పోలీసుల వాహనాలపైకి సాయుధ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్‌పీజీ షెల్స్‌ను సంధించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి ప్రతికాల్పులు జరిపారు. కొన్ని గంటల పాటు ఈ కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి.  ఈ ఘటనలోనే  పోలీసు కమాండో వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్‌ అమరులయ్యారు. మోరే పట్టణంలో కొందరు కుకీ మిలిటెంట్లు ఒక పోలీసు వాహనానికి ఎదురుగా నిలబడి.. తుపాకీతో బెదిరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మోరే పట్టణంలో జనవరి 16న ఉదయం 12 గంటల నుంచి కర్ఫ్యూ  అమలవుతోంది. కాగా, 2023 మే 3న ప్రారంభమైన మణిపూర్ హింసలో 180 మందికిపైగా మరణించారు. వేలాది మంది భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.

Also Read: Google Ads -2023 : గూగుల్ యాడ్స్ వ్యయంలో నంబర్ 1 బీజేపీ.. నంబర్ 2 ఏదో తెలుసా ?

ఇటీవల మణిపూర్‌(Manipur)లో జరిగిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించడం లేదని ప్రజలు అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. మణిపూర్‌కు వచ్చి ప్రధాని ప్రజలను కలవాలని అందరూ కోరుతున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ ప్రశ్నించారు. మణిపూర్‌లో గత 8 నెలల నుంచి పాలన సరిగా లేదని ఆరోపించారు. ఇద్దరు మంత్రులు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.