జమ్మూ కశ్మీర్(J&K)లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దారుణ ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Reliance Industries Chairman Mukesh Ambani) స్పందిస్తూ.. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్
గాయపడిన బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన అంబానీ, ముంబైలోని సర్ హరికిషన్‌దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో తాము అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించారు. ఈ సేవలు తక్షణమే అందుబాటులో ఉంటాయని, అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉగ్రవాదం మానవాళికి పెను ముప్పుగా మారిందని, ఇలాంటి చర్యలను దేశం ఏ రూపంలోనూ సహించదని అంబానీ స్పష్టం చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు తమ కంపెనీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిరక్షణలో తీసుకుంటున్న ప్రతి అడుగుకూ రిలయన్స్ అండగా నిలుస్తుందని అంబానీ వివరించారు.