Manmohan Last Rites : ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని కశ్మీరీ గేట్ సమీపంలో ఉన్న నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మతపరమైన కార్యక్రమాల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు పాల్గొని నివాళులు అర్పిస్తారు. అంత్యక్రియలకు ముందు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని(Manmohan Last Rites) ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనకు అందుబాటులో ఉంచుతారు. ఉదయం 9.51 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని నిగమ్ బోధ్‌కు తీసుకెళ్లడానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
Also Read :Ratan Tata : రతన్ టాటా యువ తరానికి ఎందుకు రోల్ మోడల్..?
ఇది వరకు మాజీ ప్రధానులకు దక్కిన గౌరవమే మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికీ దక్కాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. మెమోరియల్ నిర్మించదగిన ప్రాంతంలో మన్మోహన్ అంతిమ సంస్కారాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని యమునా నదీ తీరంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు స్థలాన్ని కేటాయించాలని, ఆయన మెమోరియల్‌ను అక్కడే నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ శ్మశానంలో అంత్యక్రియలు జరిపినా అక్కడే మెమోరియల్ నిర్మించడం సాధ్యం కాదు. ఇది మన్మోహన్ సింగ్‌ను అవమానించినట్టేనని కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. ఒక సిక్కు ప్రధానిని కేంద్రం అవమానిస్తోందని జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు. ఈ తరుణంలో కేంద్ర సర్కారు కీలక ప్రకటన చేసింది. మన్మోహన్ సింగ్ మెమోరియల్ నిర్మాణానికి మరో నాలుగైదు రోజుల్లో స్థలాన్ని ఎంపిక చేస్తామని వెల్లడించింది.