Haryana : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. ఆయనకు గురువారం రాత్రి పోటురాగా వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయనను వైద్యులు రక్షించలేకపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కాగా, ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ‘ఓం ప్రకాశ్ చౌతాలా మరణవార్త చాలా బాధాకరం. ఆయన హరియాణాకు, దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని ఖర్గే ట్వీట్ చేశారు. ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులూ సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఇక, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కూడా ప్రకాశ్ చౌతాలా మృతిపై ట్వీట్ చేశారు. “చౌతాలా మరణం చాలా బాధాకరం. ఆయనకు నా నివాళులు. ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు” అన్నారు. కాగా, ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల హరియాణా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఓం ప్రకాశ్ చౌతాలా సీఎంగా ఉన్నప్పుడు నేను లోక్‌సభ సభ్యునిగా ఉన్నాను. మా మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది. చౌతాలా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవారు. ఆయన ఇంత తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోతారని నేను ఊహించలేదు. ఆయన చాలా మంచి వ్యక్తి, నాకు పెద్దన్నయ్య లాంటివారు” అని అన్నారు.
Read Also: Formula-E Race Case : కేటీఆర్‌పై చర్యలు తప్పేం కాదు: ఎమ్మెల్సీ కోదండరాం