Economic Survey 2024 : ‘ఆర్థిక సర్వే 2023-24’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆమె ప్రస్తుతం సర్వే(Economic Survey 2024) వివరాలను సభలో వెల్లడిస్తున్నారు. ఆర్థిక సర్వే ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మన దేశ వాస్తవిక జీడీపీ వృద్ధిరేటు 6 .5 శాతం నుంచి 7 శాతం మేర ఉంటుందని ఆమె తెలిపారు. మన దేశంలోని ప్రతి ఇద్దరు యువతలో ఒకరికి కాలేజీ విద్య పూర్తి చేసుకొని నుంచి బయటికి రాగానే ఉద్యోగిత లభించడం లేదన్నారు. దేశంలో సేవారంగమే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను క్రియేట్ చేస్తోందని నిర్మల చెప్పారు. నిర్మాణ రంగం కూడా పెద్దసంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. గత పదేళ్లలో ఉద్యోగాల కల్పనలో తయారీ రంగం డీలా పడిందని చెప్పారు. తయారీ రంగంలోని పలు సంస్థలు రుణభారం వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి బలహీనపడ్డాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో మన దేశంలోకి 45.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 47.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చే అవకాశం ఉందన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంతో ముందుకు సాగుతోందని ఆర్థిక సర్వే అంచనా వేసిందని నిర్మల(FM Nirmala) తెలిపారు. కొవిడ్ మహమ్మారి తర్వాత దేశం కోలుకున్న తీరు అపూర్వమన్నారు.
We’re now on WhatsApp. Click to Join
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని లేవనెత్తారు. చాలామందికి ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చనే అభిప్రాయం ఉందన్నారు. దీనికి కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ బదులిస్తూ.. పరీక్ష పేపర్లు లీక్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాజకీయాల కోసమే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షల పారదర్శక నిర్వహణ అత్యంత కీలక అంశమని స్పీకర్ ఓం బిర్లా ఈసందర్భంగా అన్నారు. అనంతరం నీట్ పరీక్ష లీకేజీ ఘటనపై సభలో విపక్షాలు నినాదాలు చేశాయి. దీనిపై చర్చించాలని పట్టు పట్టాయి. ఆ నినాదాల మధ్యే సభ కొనసాగుతోంది.
Also Read :Health tips: బెడ్ పై కూర్చుని తింటున్నారా.. ఈ సమస్యలు రావడం ఖాయం?
ఇది అమృత్ కాల్ బడ్జెట్ : ప్రధాని మోడీ
అంతకుముందు లోక్‌సభ సెషన్ ప్రారంభం కాగానే దివంగత వియత్నాం నాయకుడు గుయెన్ ఫు ట్రోంగ్(80)కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర సభ్యులు నివాళులర్పించారు. బంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సభలోకి వచ్చే ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్‌గా తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.