Tata Electronics Fire Accident: హోసూర్ ఇండస్ట్రియల్ టౌన్‌లోని టాటా ఫ్యాక్టరీ (Tata Electronics)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఉద్యోగులతో సహా ఎవరికీ గాయాలు కాలేదు. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని తిమ్జేపల్లి పంచాయతీ పరిధిలోని కుఠాన్‌పల్లి గ్రామంలో టాటాకు చెందిన సెల్‌ఫోన్ విడిభాగాల తయారీ కర్మాగారం ఉంది. 20 వేల మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు.
హోసూర్(Hosur) మరియు సమీప జిల్లాల నుండి ఏడు అగ్నిమాపక యంత్రాలు సంఘటన ప్రదేశానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 6 గంటలకు క్యాంపస్‌లోని ఒక రసాయన గోడౌన్ వద్ద ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు అని హోసూర్ ఫైర్ స్టేషన్‌లోని సీనియర్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ అధికారి తెలిపారు.
ఈ అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల వారు కూడా భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగలు వ్యాపించడంతో చుట్టుప్రక్కల ప్రాంతాలపై ప్రభావం చూపించింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాగా అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీకి భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఈ ఘటనపై రాయకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ యూనిట్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
టాటా ఎలక్ట్రానిక్స్ కూడా హోసూర్‌లోని తమ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌లు పాటించామని, ఉద్యోగులందరికీ భద్రత కల్పించామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు ప్రకటన కూడా విడుదల చేశారు. ఉపశమనం మరియు రెస్క్యూ సమయంలో ముగ్గురు ఉద్యోగులలో శ్వాసకోశ సమస్యలు కనిపించాయని పోలీసులు తెలిపారు. వాళ్ళని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
Also Read: Death Penalty : నేరం రుజువైతే కోల్‌కతా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష: సీబీఐ కోర్టు