Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఈరోజు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే.. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం బాధ్యత ముళ్ల కిరీటం లాంటిదని.. ప్రజల ఆశలను నెరవేర్చడంలో దేవుడు తన తనయుడికి అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
”ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్ట్లోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని నేను నమ్ముతున్నాను” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కొత్త ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రాష్ట్ర హోదా పునరుద్ధరణ అని ఒమర్ అబ్దుల్లా కుమారుడు జహీర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్(SKICC)లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ప్రకటించింది.