Site icon HashtagU Telugu

Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah Comments Kandahar Hijack

Kandahar Hijack : కాందహార్ హైాజాక్ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత,  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘‘25 ఏళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814 హైజాక్ అయింది. ఆ టైంలో బందీలను వదిలేసేందుకుగానూ తాము చెప్పే ముగ్గురు ఉగ్రవాదులను జైలు నుంచి రిలీజ్ చేయాలని హైజాకర్లు ప్రతిపాదించారు. అప్పటి బీజేపీ ప్రభుత్వానికి నేను ఒక్కటే విషయం చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు ఉగ్రవాదులను వదలొద్దని సూచించాను’’ అని ఆయన తెలిపారు. అయినా ఆనాటి బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. తప్పుల తర్వాత తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ఫరూక్ అబ్దుల్లా(Kandahar Hijack) ప్రశ్నించారు.

Also Read :BJLP Meeting : అసెంబ్లీలో బీజేఎల్పీ భేటీ.. కీలక నిర్ణయాలు, డిమాండ్లు ఇవే

‘‘ఆనాటి బీజేపీ ప్రభుత్వం ముగ్గురు ఉగ్రవాదులను వదిలేయబట్టే ఇప్పుడు ఉగ్రవాదం పెరిగిపోయింది. బీజేపీ సర్కారు చేసిన తప్పు వల్లే.. తర్వాతి కాలంలో ఎన్నో ఉగ్రవాద దాడులను భారత్ ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఆ పర్యవసానాలను దేశ ప్రజలు అనుభవించారు’’ అని ఫరూక్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాందహార్ హైజాక్ ఘటన జరిగిన టైంలో తాను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

‘‘ఉగ్రవాద సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని నేను చెబుతుంటే.. బీజేపీ సర్కారు తప్పుపడుతోంది. చైనా మన దేశంలోకి చొరబడి భూమిని ఆక్రమిస్తున్నా.. శాంతిమంత్రమే ఎందుకు జపిస్తున్నారు ? చైనాతో చర్చలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు ?’’ అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. చైనాతో శాంతిచర్చలు ఎంత ముఖ్యమో.. చైనా మిత్రదేశం పాకిస్తాన్‌తోనూ శాంతిచర్చలు అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. ‘‘ప్రపంచంలో సుదూరంగా ఉన్న మిత్రదేశాలను మనం వదులుకున్నా పెద్దగా సమస్య ఉండదు. కానీ పొరుగునే ఉన్న మిత్రదేశాలను దూరం చేసుకోవద్దు. వారితో స్నేహంగానే ఉండాలి. అప్పుడే ఇరు దేశాలు అభివృద్ధి చెందుతాయి’’ అని ఫరూక్ అబ్దుల్లా సూచించారు.