Farmers : పంజాబ్‌లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు

ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్‌ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Farmer unions protest in Punjab..163 trains cancelled

Farmer unions protest in Punjab..163 trains cancelled

Farmers : రైతు సంఘాలు తమ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం పంజాబ్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్నదాతల డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్‌ వ్యాప్తంగా కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా , సంయుక్త కిసాన్‌ మోర్చా బంద్‌ చేపట్టింది. ఈ బంద్‌తో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది. ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్‌ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ గేట్‌, బటిండాలోని రాంపురా ఫుల్‌, మొహాలీలోని ఐఐఎస్‌ఈఆర్‌ చౌక్‌ వద్ద ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు, కురాలి రోడ్‌ టోల్‌ ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా, ఢిల్లీ హైవే, ఖరార్‌, మొరిండా హైవే సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు. రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. రోడ్డు, రైలు మార్గాలను రైతులు దిగ్బంధించారు. బంద్ నేపథ్యంలో పంజాబ్ మీదుగా వెళ్లే 163 రైళ్లను నార్తర్న్ రైల్వే రద్దు చేసింది.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కిపైగా రోడ్లను రైతులు బ్లాక్‌ చేశారు. పంజాబ్‌ అంతటా ప్రధాన రహదారులు, మార్కెట్‌ ప్రాంతాలు మూతపడ్డాయి. ఢిల్లీ, పంజాబ్‌ మధ్య రాకపోకలు సాగించే దాదాపు 163 రైల్వే సర్వీసులకు రద్దయ్యాయి. దీంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల బంద్‌ నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాలు, వైద్య, పెళ్లి, ఉద్యోగ ఇంటర్వ్యూ సహా అత్యవసర సేవలను బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. మొహాలి జిల్లా అంతటా దాదాపు 600 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Read Also: Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు

 

 

 

  Last Updated: 30 Dec 2024, 12:32 PM IST