Site icon HashtagU Telugu

Zuckerberg Vs Ashwini Vaishnaw : భారత ఎన్నికలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్

Mark Zuckerberg Vs Ashwini Vaishnaw Facebook Founder Indias Pm Modi

Zuckerberg Vs Ashwini Vaishnaw : 2024లో జరిగిన భారతదేశ సార్వత్రిక ఎన్నికలపై ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలను భారత ఐటీ శాఖ మంత్రి అశ్వినీ  వైష్ణవ్ తప్పుపట్టారు. జో రోగన్ అనే యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశ ఎన్నికలపై జుకర్ బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆయన పేర్కొన్నారు.

Also Read :Blow To Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ షాక్.. అధికారాల్లో కోత.. స్వేచ్ఛకు పరిమితి

జుకర్ బర్గ్ కామెంట్స్ ఏమిటి ?

‘‘2024లో వివిధ ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినట్లు రుజువైంది. భారత్‌లోనూ స్పష్టంగా ఆ ట్రెండ్ కనిపించింది. ధరల మంట (ద్రవ్యోల్బణం),  కరోనా సంక్షోభ కాలంలో అమలుచేసిన అడ్డదిడ్డమైన ఆర్థిక విధానాల ప్రతికూల ప్రభావంతో  అధికార పార్టీలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. దాని పర్యవసానం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చాలాదేశాల్లో అధికార పార్టీలు గద్దె దిగాల్సి వచ్చింది’’ అని జుకర్ బర్గ్(Zuckerberg Vs Ashwini Vaishnaw) వ్యాఖ్యానించారు. దీనిపై భారత ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. 2024లో కోట్లాది మంది ఓటర్లతో భారత్‌లో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరోసారి భారతీయులు ప్రధాని మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. మళ్లీ ఎన్డీయే కూటమికే అధికార పట్టం కట్టారు’’ అని ఆ పోస్ట్‌లో అశ్వినీ వైష్ణవ్ రాసుకొచ్చారు.

Also Read :100 Medals Returned : ప్యారిస్ ఒలింపిక్స్ ప్రమాణాలు పతనం.. 100 పతకాలు వాపస్.. ఎందుకు?

‘‘2024 ఎన్నికల్లో భారత్‌లో అధికార పార్టీ ఓడిపోయిందనే జుకర్ బర్గ్ వాదన తప్పు. కరోనా సంక్షోభ కాలంలో భారత్‌లో అడ్డదిడ్డమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. 80 కోట్ల మంది దేశ ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని మేం అందించాం. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది. వీటన్నింటి వల్లే వరుసగా మూడోసారి ప్రధాని మోడీ  హయాంలో భారత్‌లో ప్రభుత్వం కొలువుతీరింది. ప్రజా విశ్వాసం వల్లే ఇదంతా సాధ్యమైందని జుకర్ బర్గ్ గుర్తించాలి’’ అని కేంద్ర ఐటీ మంత్రి వివరించారు. తన పోస్ట్‌లో ‘మెటా’ కంపెనీని ఆయన ట్యాగ్ చేశారు. ‘‘జుకర్ బర్గ్ స్థాయి వ్యక్తి తప్పుడు సమాచారంతో మాట్లాడుతుండటం నాకు బాధను కలిగించింది. నిజం, విశ్వసనీయతలకు మనం కట్టుబడి ఉండాలి’’ అని జుకర్ బర్గ్‌కు అశ్వినీ వైష్ణవ్ సూచించారు.