Yasin Malik Case : ‘‘26/11 ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ న్యాయంగానే జరిగింది. అలాంటప్పుడు కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ను మాత్రం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట ఎందుకు హాజరుపర్చకూడదు ?’’ అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివిధ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న యాసిన్ మాలిక్‌ను జమ్మూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలదని సీబీఐని దేశ సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. జమ్మూలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని పేర్కొంది. ఢిల్లీలోని తిహార్ జైలులోనే నేరుగా న్యాయ విచారణను నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సమాచారం సేకరించి తమకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ విధమైన విచారణకు సంబంధించిన నిబంధనల గురించి తాను తెలుసుకుంటానని కోర్టుకు తుషార్ మెహతా బదులిచ్చారు.
Also Read :Cyanide Killings : ‘సైనైడ్ సైకో’కు మరణశిక్ష.. అప్పులు ఇచ్చిన 14 మంది ఫ్రెండ్స్ మర్డర్
‘‘యాసిన్ మాలిక్‌పై(Yasin Malik Case) ఉన్న కేసులలో సాక్షులుగా ఉన్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే మేం అతడిని కోర్టు విచారణ కోసం జమ్మూకు తీసుకెళ్లలేం’’ అని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ‘‘వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకానని యాసిన్ మాలిక్ అంటున్నాడు. ఒక లాయర్‌ను పెట్టుకునేందుకు కూడా అతడు సిద్ధంగా లేడు’’ అని ఆయన కోర్టుకు చెప్పారు. పాకిస్తాన్ కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో కలిసి వేదికపై యాసిన్ మాలిక్ కూర్చున్న ఒక ఫొటోను ఈసందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చూపించారు. యాసిన్ మాలిక్ సాధారణ నిందితుడు కాదని తెలిపారు.
Also Read :Adani Shares Crash : ‘అదానీ’ షేర్లు ఢమాల్.. అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లూ డౌన్
1990లో జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ శివారులో జరిగిన నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసులో యాసిన్ మాలిక్ నిందితుడిగా ఉన్నాడు. 1989లో రుబయా సయీద్ (నాటి జమ్మూకశ్మీర్ హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె) కిడ్నాప్ కేసులో కూడా యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులను విచారించే క్రమంలోనే యాసిన్ మాలిక్‌ను వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుపర్చాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఉగ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం తిహార్ జైలులో జీవితఖైదు శిక్షను యాసిన్ మాలిక్ అనుభవిస్తున్నాడు.